కుట్రలను ఛేదించాం..

– తెలంగాణ గొంతుకను వినిపించాం…
– బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆనాడు సమైక్యవాదుల కుట్రలను ఛేదించుకుని తెలంగాణను సాధించుకున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ గొంతుకను పార్లమెంటులో వినిపించామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవా న్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో ని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌… గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. 2001లో శూన్యం లాంటి వాతావరణంలో కేసీఆర్‌… బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనేక ప్రతికూలతల మధ్య స్వరాష్ట్రం కోసం పోరాడి, విజయం సాధించామని తెలిపారు. కేసీఆర్‌ నడిపిన ఉద్యమం అనేక రాష్ట్రాలకు, ప్రజాస్వామ్యవాదులకు దిక్సూచిగా నిలిచిందని వివరించారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందనీ, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. తొమ్మిదిన్నరేండ్ల తమ పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపామని వివరించారు. పార్టీని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న సదుద్దేశంతో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సాలాంటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని చెప్పారు. దురదృష్టవశాత్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రాలేదని వాపోయారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పార్టీగా అండగా నిలబడి మద్దతిస్తున్న కార్యకర్తలు, నాయకులందరికీ కేటీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Spread the love