అప్పుడే చెప్పాం..వినలే

We just said..Vinale– ఇప్పుడవే సమస్యలు వెంటాడుతున్నాయి
– జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ ఎదుట విద్యుత్‌రంగ నిపుణులు రఘు వివరణ
– రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేశారు : కోదండరాం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం పూర్తిగా లోపభూయిష్టమని 2016లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించినా, పట్టించుకోలేదని విద్యుత్‌రంగ నిపుణులు కే రఘు చెప్పారు. మంగళవారంనాడాయన ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ ఎదుట తన వాదన వినిపించారు. ఆయనతో పాటు అప్పటి విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కూడా ఉన్నారు. కమిషన్‌ ఎదుట రఘు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఒప్పందంలోని లోపాలను కమిషన్‌కు వివరించారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణంపైనా తమ అభ్యంతరాలను తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం తెలుపలేదని స్పష్టం చేశారు. కేవలం మధ్యంతర టారిఫ్‌పై మాత్రమే ఓ ఆర్డర్‌ ఇచ్చారనీ, అది లెర్నింగ్‌ లైసెన్స్‌ వంటిదే తప్ప, ఆమోదం తెలిపినట్టు కాదన్నారు. పై అంశాలపై తమ వద్ద ఉన్న సమాచారం మొత్తం కమిషన్‌కు అందచేశామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందాన్ని ఎమ్‌ఓయూ రూపంలో కాకుండా టెండర్‌ ప్రక్రియ ద్వారా అయితే ఎలాంటి ప్రయోజనాలు కలిగేవో కమిషన్‌కు వివరించినట్టు చెప్పారు. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సంస్థలు ఏనాడు కరెంటును సరఫరా చేయలేదన్నారు. ఈ ఒప్పందం వల్ల విద్యుత్‌ సంస్థలకు రూ.2,600 కోట్ల నష్టం జరిగిందన్నారు. మొదట చేసుకున్న ఒప్పందంప్రకారమే సక్రమంగా విద్యుత్‌ సరఫరా జరగనప్పుడు, దానికి అదనంగా మరో వెయ్యి మెగావాట్లకోసం అదే ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్నారనీ, దానివల్ల లాభం లేదని తర్వాత తెలుసుకొని రద్దు చేసుకుందామనుకుంటే సాధ్యం కాలేదని వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణం చేపట్టారనీ, ఇక్కడ కూడా కాంపిటీషన్‌ పద్ధతిలో కాకుండా పరస్పర ఒప్పందాలు (ఎమ్‌ఓయూ) చేసుకున్నారన్నారు. 2013-24 తర్వాత కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌లో బీహెచ్‌ఈఎల్‌ జీరోకు పడిపోయిందనీ, దీనిపై కాగ్‌ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి సంస్థకు ఎమ్‌ఓయూ రూపంలో ప్రాజెక్టుల్ని ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మూడేండ్లలో పూర్తి కావల్సిన ప్రాజెక్టులు 9 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్‌ కాదనీ, బలవంతంగా ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని రుద్దారని విమర్శించారు. 2010లో తయారు చేసుకున్న సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ యంత్రాలను బీహెచ్‌ఇఎల్‌ ఆరేండ్ల తర్వాత ప్రభుత్వానికి అంటగట్టిందనీ, ఆ యంత్రాలు సరైనవి కావని తేల్చిచెప్పారు. గోదావరిలో వరద ఎక్కువైతే భద్రాద్రి థర్మల్‌ కేంద్రం ముంపునకు గురవుతుందనీ, ఆ విషయం అప్పట్లోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను తప్పుడు లోకేషన్‌లో నిర్మాణం చేయడం వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుందని వివరించారు. భద్రాద్రి నిర్మాణంలో పర్యావరణ అంశాలను లెక్క చెయ్యలేదనీ, ఆలస్యానికి ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ అంశాలపై పలు అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్‌ దృష్టికి 2016లోనే తీసుకెళ్లామనీ, దీనిపై విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను ఏడేండ్ల వరకు చేయలేదని గుర్తుచేశారు.
రాజ్యాంగ వ్యవస్థల్ని పట్టించుకోలేదు-కోదండరాం
ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలే తప్ప, ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తామంటే కుదరదని అప్పటి విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌, యాదాద్రి, భద్రాద్రిపై అప్పట్లోనే తాము అనేక లోపాలు ఎత్తి చూపామనీ, నిర్భంధాలు ప్రయోగించి, ప్రశ్నించే గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. కాళేశ్వరం సహా రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. కమిషన్‌ ఎదుట తమ వద్ద ఉన్న సమాచారం అంతా ఇచ్చామనీ, మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు సహకరించాలని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి మాజీ సీఎం కే చంద్రశేఖరరావు రాసిన లేఖలోని అంశాలపై సాంకేతిక వివరణలు కోరినట్టు తెలిసింది. లేఖలోని రాజకీయ, వ్యక్తిగత అంశాలను ఓ భాగంగా, ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణంపై ఆయన ఇచ్చిన సమాచారాన్ని కూడా క్రాస్‌ చెక్‌ చేసుకు న్నట్టు సమాచారం. కేసీఆర్‌ను మరోసారి విచారణకు వ్యక్తిగతంగా పిలవాలా లేదా అనే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. అయితే మరోసారి కేసీఆర్‌కు లేఖ రాస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా కమిషన్‌ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Spread the love