నిషేధిత జాబితాలోని భూములను తొలగించాలి
రేవంత్‌రెడ్డి, పొంగులేటికి రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు
బాధితుల రక్షణకు లీగల్ సెల్ ఏర్పాటు
కమీషన్లు, సెటిల్‌మెంట్ల కోసమే 22ఏ
మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తెలియకుండానే 22ఏ అమల్లోకి వచ్చిందా?అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు ప్రశ్నించారు. అధికారులు నిర్ణయం తీసుకుని ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురిచేసే అవకాశముందా?అని అడిగారు. ఒకటి, రెండు రోజులు వేచిచూస్తామనీ, ప్రభుత్వం స్పందించి 22ఏపై నిర్ణయం తీసుకోకుంటే బాధితులతో కలిసి పెద్దఎత్తున సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అక్రమంగా నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రకు కారకులైన అధికారులపై, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూముల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో తన్నీరు హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 22ఏ బాధితుల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసిందనీ, 10 మంది న్యాయవాదులతో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అడ్వకేట్ కళ్యాణ్ 812535604 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందొద్దనీ, బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 30 శాతం కమీషన్లు, 50-50 సెటిల్‌మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేట్ భూములను 22ఏలో పెట్టిందని ఆరోపించారు.ఎవ్వరూ భయపడి 20 శాతం, 30 శాతం కమీషన్లు ఇవ్వొద్దనీ, తక్కువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దని కోరారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు. హూడా, హెచ్‌ఎమ్‌డీఏ ఆమోదించిన లేఅవుట్లలో, 30 ఏండ్ల క్రితం కొనుక్కున్న ఇండ్లను కూడా ఇప్పుడు 22ఏలో పెట్టారంటే దీని వెనుక ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తోందో అర్థమవుతోందని చెప్పారు. బుద్వేల్ గ్రామం సర్వే నెంబర్ 282, 283, 284లలోని 30 ఎకరాల భూమి కోసం సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే 22ఏ నుంచి అనుమతి ఇచ్చి రూ.కోట్ల దందా చేశారని ఆరోపించారు. శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 20/1, 21 లో ఎస్‌ఏఎస్ ఇన్ఫ్రా ప్రాపర్టీ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుని 22ఏ నుంచి ఆమోదం తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించారని వివరించారు. బిల్డర్ పని అయిపోయాక మళ్లీ 10 రోజుల క్రితం దాన్ని 22ఏలోకి మార్చారని విమర్శించారు. సంగారెడ్డి సమీపంలో శిల్పా మోహన్ రెడ్డి భూమిని 22ఏ నుంచి తీసి రిజిస్ట్రేషన్లు చేశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి మళ్లీ 22ఏలో పెట్టించారని అన్నారు. వారి ఇష్టారాజ్యంతో కొనుక్కున్న సామాన్యుల జీవితాలు ఏమవ్వాలని ప్రశ్నించారు. అమీన్‌పూర్ కేఎస్ఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 500 ఇండ్లను 22ఏలో పెట్టి కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరిలో 40 వేల ఎకరాలు 22ఏలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిస్తే బీఆర్ఎస్ నాయకులకు ప్రజల తరఫున పోరాటాలు చేయడం తెలుసని అన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను రోడ్డున పడేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



