ఇరాన్‌కు ట్రంప్ బెదిరింపులు.. ఇక చర్చలు లేవన్న టెహ్రాన్
మధ్యప్రాచ్యంలో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు
వాషింగ్టన్, టెహ్రాన్ : మధ్య్రపాచ్యంలో అస్థిర ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై కొన్ని గంటల పాటు దాడులు ఆపేసిన అమెరికా.. ఆ తర్వాత బెదిరింపులకు దిగింది. ఇటు ఇరాన్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళన సర్వత్రా నెలకొంది. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత రాజీకి బదులుగా యుద్ధమే జరుగుతుందనే భయాలు మధ్యప్రాచ్యంలో కనిపిస్తున్నాయి.
ఎప్పుడూ తన వ్యాఖ్యలతో గందరగోళ పరిస్థితులను సృష్టించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మళ్లీ బెదిరించారు. ఇరాన్‌పై 1000 క్షిపణులను ప్రయోగిస్తామని అన్నారు. తనను హత్య చేసేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసిందన్న ఇజ్రాయిల్ నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒకవేళ తనను హతమారిస్తే.. ఇరాన్‌పై భీకరమైన సైనిక చర్యను ప్రారంభించాలని అమెరికా సైన్యానికి, శ్వేత సౌధానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ‘‘ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇరాన్‌ను సమూలంగా నిర్మూలించడానికి, నాశనం చేయడానికి ఏడాది పాటు అవసరమైతే అంతకన్నా ఎక్కువ కాలమే దాడులు చేయడానికి పూర్తి సన్నద్ధతతో అమెరికా మిలటరీ సిద్ధంగా వుంది’’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.
మేమెలాంటి అభ్యర్థనా చేయలేదు : ఇరాన్ స్పష్టీకరణ
ఇక కాల్పుల విరమణ ముగిసినట్టేనని ఇరాన్‌కు ఇప్పటికే తెలియచేశామని వివరించారు. అయితే చర్చలు కొనసాగించాలని వారు (ఇరాన్) కోరారనీ, అందుకు అమెరికా అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. తాము అటువంటి అభ్యర్ధనేదీ చేయలేదని తెలిపింది. అయితే చర్చల కోసం మధ్యవర్తి ఖతార్ చేసిన అభ్యర్ధనను తాము తోసిపుచ్చలేదని వివరించింది. గత వారమంతా ఇరాన్‌పై అమెరికా పదేపదే దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ చర్చలపై ట్రంప్‌తో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సద్ ఫోన్‌లో మాట్లాడారు. సౌదీ-అమెరికా సహకారం, వివిధ రంగాల్లో దాన్ని పెంచుకునే విషయమై ఉభయ పక్షాలు చర్చలు జరిపాయని సౌదీ పత్రికా సంస్థ తెలిపింది. సముద్ర మార్గాల భద్రత, ప్రాంతీయ భద్రత, సుస్థిరతకు దోహదపడే ఇతర అంశాలు, కృషి గురించి కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు కీలకమైన హర్ముజ్ జలసంధిపై చర్చించేందుకు గానూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శనివారం ఒమన్ బయలుదేరి వెళ్ళారు.
చర్చలకు టెహ్రాన్ నో
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ ఇప్పుడు చర్చలకు నిరాకరించింది. అమెరికా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గే వరకు ఎలాంటి చర్చలూ సాధ్యం కావని స్పష్టం చేస్తోంది. ఈ వారం మొత్తం అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధమే కాకుండా, వరుస క్షిపణి దాడులు కూడా జరిగిన విషయం విదితమే. హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణ వాతావరణ.. గంటల వ్యవధిలోనే పలు ఇరాన్ నగరాలపై బాంబు దాడులకు దారితీసింది. అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమవుతున్న తరుణంలో, అమెరికా దాడికి ప్రతీకారంగా టెహ్రాన్.. ఖతార్, బహ్రెయిన్‌లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవలసి వచ్చింది. అమెరికా అంతటితో ఆగలేదు. టెహ్రాన్ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వరుస దాడులు జరిపి, వంతెనలను పేల్చివేయడంతో పాటు చమురు శుద్ధి కర్మాగారాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈలోగా ఇరాన్.. టెల్ అవీవ్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. కాగా ట్రంప్ తాజా ప్రకటన, మొజ్తాబా ఖమేనీ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
అమెరికా వరుస ఉల్లంఘనలు : అరాగ్చీ
ఒక పెద్ద యుద్ధానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని తెలియజేయడమే కాకుండా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏ క్షణంలోనైనా యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, కాల్పుల విరమణ ముగిసిందని ఆయన పదేపదే పునరుద్ఘాటించారు. అయితే ఈ విషయంలో అమెరికా తీరును ఇరాన్ తప్పుబడుతోంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ఇరాన్ ఇప్పటివరకు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. అయితే అమెరికా.. అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లోని 9వ పేరాను ఉల్లంఘించింది. అమెరికా ఒకదాని తర్వాత ఒకటి ఉల్లంఘనలకు పాల్పడుతోంది. శాశ్వత కాల్పుల విరమణపై ఉన్న ఆశలన్నీ అడుగంటాయి. ఇప్పుడు ఇరు దేశాల క్షిపణులు గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
క్షిపణులతో నాశనం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


