
నవతెలంగాణ-పెద్దవంగర: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారి మండలానికి వచ్చిన ఆయనను చూసి కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. వారిని సముదాయిస్తూ.. ఎర్రబెల్లి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు ఎవరు బాధపడొద్దని, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. పదవిలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందించారని కొనియాడారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, నాయకులు రాజు, సోమన్న, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.