నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో ఉంచుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2025 సంవత్సర శుభాకాంక్షలను అధికారులు తెలియజేశారు. కలెక్టర్ సూచన మేరకు బుక్స్, బ్లాంకెట్స్ అందిస్తు నూతన సంవత్సరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరందోలిలో జనవరి రెండవ తేది నుంచి నిర్వహించే జంగుబాయి ఉత్సవాల పోస్టర్లను నిర్వహణ కమిటీ సభ్యులు సలాం శ్యాంరావ్, మరప బాజీరావు, కోడప జకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో అందరికి మంచి జరాగాలన్నారు. యువత మంచి దిశగా వెళ్లడంతో పాటు పిల్లలు భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. తన పిలుపు మేరకు అధికారులు, జిల్లా ప్రజలు సామాజిక బాధ్యతగా బుకేకు బదులుగా బుక్స్, బ్లాంకెట్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అవసరమున్న వారికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. సమాజంలో విద్య చాలా ముఖ్యమని అందుకే అవసరమున్న వారికి నోట్ బుక్స్, మహానీయుల జీవిత చరిత్రలు తెలియజేసే మంచి పుస్తకాలు మార్గదర్శనం చేయడానికి ఉపయోగపడుతాయన్నారు.