గ్రేస్‌ మార్కులు తొలగిస్తాం

We will remove the gray marks– నీట్‌ పరీక్షపై సుప్రీంకు కేంద్రం వెల్లడి
– 23న తిరిగి పరీక్ష, 30న ఫలితాలు
న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష సందర్భంగా సమయం కోల్పోయారనే కారణంతో 1563మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్‌ మార్కులను ఉపసంహరిం చుకుంటామని కేంద్రప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారిలో పరీక్ష తిరిగి రాసేందుకు సిద్ధమైన విద్యార్థులకు జూన్‌ 23న పరీక్ష నిర్వహించే అవకాశం వుందని తెలిపింది. ఈ విద్యార్ధులకు గ్రేస్‌ మార్కులు కలపకుండా వారికి వచ్చిన ఒరిజినల్‌ స్కోర్‌ను తెలియజేస్తామని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌కు కేంద్రం తెలియజేసింది. పరీక్ష రాయడానికి అవసరమైన 3.2 గంటల సమయాన్ని వారికి అనుమతించలేదనే కారణంతో నార్మలైజేషన్‌ ఫార్ములా ప్రాతిపదికన 1563మంది అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు కలపడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు ఈ గ్రేస్‌ మార్కులు కలిపారు. ఈ చర్యపై పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేశారు. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఎన్‌టిఎ మరో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ నెల 10, 12 తేదీల్లో చర్చలు జరిపింది. కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కనూ అగర్వాల్‌ మాట్లాడుతూ, గ్రేస్‌ మార్కులు కలపడం వల్లనే ఈ ఆందోళనకర పరిస్థితి ఎదురైందని కమిటీ అభిప్రాయపడినట్లు చెప్పారు. అసలు ప్రయత్నం చేయని ప్రశ్నలకే ఈ గ్రేస్‌ మార్కులు పరిమితం చేశారు. మే 5న జరిగిన పరీక్షలో పొందిన గ్రేస్‌ మార్కులు కలపకపోయినప్పటికీ, తిరిగి పరీక్ష రాయడానికి ఇష్టపడని బాధిత విద్యార్థుల వాస్తవ మార్కులను వెంటనే ప్రకటించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1563 మంది అభ్యర్థుల్లో తిరిగి పరీక్ష రాసే అభ్యర్థులకు కొత్తగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని, ముందు పరీక్ష నాటి మార్కులను రద్దు చేస్తారని కోర్టు తెలిపింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తేదీ కూడా ఈ రోజే చెబుతామని ఎన్‌టీఏ తరపు న్యాయవాది నరేష్‌ కౌశిక్‌ అంతకుముందు తెలిపారు.
జూన్‌ 23న పరీక్ష నిర్వహించి, 30న ఫలితాలు ప్రకటిస్తామని ఆ తరువాత ఎన్‌టీఏ ప్రకటించింది. జులై 6 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ సెషన్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్‌టీఏ తెలిపింది. గ్రేస్‌ మార్కులపై దాఖలైన పిటిషన్లను బెంచ్‌ విచారిం చింది. ప్రశ్నాపత్రం లీక్‌ల ఆరోపణలపై స్పందనను రెండు వారాల్లోగా దాఖలు చేయాలని కోర్టు ఎన్‌టిఎను ఆదేశించింది. పది మంది అభ్యర్థులు దాఖలు చేసిన మరో పిటిషన్‌ను విచారించిన కోర్టు, విచారణను జులై 8కి వాయిదా వేసింది.

Spread the love