రాహుల్‌కు ఘన స్వాగతం

రాహుల్‌కు ఘన స్వాగతం– పశ్చిమ బెంగాల్‌లో భారత్‌ జోడో న్యారు యాత్ర
– ఆయనను చూసేందుకు వేలాదిగా గుమిగూడిన ప్రజలు
కోల్‌కతా : కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది.రాహుల్‌ గాంధీ యాత్రం అసోం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. ఆయనకు కూచ్‌ బెహార్‌ ప్రజలు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది స్థానికులు, ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాహుల్‌ రాకతో వారంతా రోడ్లపై గుమికూడారు. దీంతో రాహుల్‌ గాంధీ ప్రజల కోసం ఆగాల్సి వచ్చింది. అయితే, అసోంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించినట్టుగానే పశ్చిమ బెంగాల్‌లోని మమత సర్కారు ప్రవర్తిస్తున్నది. రాహుల్‌ యాత్రకు ఆటంకాలు కలిగించే చర్యలకు దిగింది. న్యారు యాత్రకు అనుమతివ్వ కుండా మధ్యలోని ఆపటానికి పోలీసులు ప్రయత్నించారు. రాహుల్‌ యాత్రపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ చేయటం కనిపించింది. రాహుల్‌ ‘రాష్ట్రాన్ని వీడాలి’ అని, కాంగ్రెస్‌ ‘బెంగాల్‌ను విడిచిపెట్టాలి’ అని పలు రకాల మీమ్స్‌, పోస్టులతో టీఎంసీ కార్యకర్తలు న్యారు యాత్రకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారాలు చేశారు. దీదీ (సీఎం మమత బెనర్జీ) రాష్ట్రంలో బీజేపీని ఒంటి చేతితో ఎదుర్కోగలరని ఆ పోస్టుల్లో టీఎంసీ కార్యకర్తలు పేర్కొనటం గమనార్హం. కాగా, టీఎంసీ తీరును కాంగ్రెస్‌ తప్పుబట్టింది. బెంగాల్‌లో బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రజల మధ్య ద్వేషం, హింస, శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్‌ ఆరోపించాడు. ఈ అనిశ్చిత పరిస్థితిని అధిగమించేందుకు తాము న్యారు యాత్రను ప్రారంభించామని తెలిపారు. కాగా, రాహుల్‌ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించినపుడు తన మొదటి ప్రసంగంలో.. ”ఎలా ఉన్నారు? నేను మాట్లాడటానికి కాదు, మీరందరూ చెప్పేది వినడానికే వచ్చాను” అని తెలిపారు.కాగా, రాహుల్‌ భారత్‌ జోడో న్యారు యాత్రలో ఎక్కడ ఆహ్వానం వచ్చినా చేరాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. న్యారు యాత్రలో పార్టీ ప్రాంత నాయకత్వం ఉంటుందనీ, పార్టీ పనుల నిమిత్తం కూచ్‌బెహార్‌లో ఉన్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు సూర్జ్యకాంత మిశ్రా తెలిపారు.

Spread the love