– ‘ప్రగతి ప్రస్థానం..ఎట్లుండే
– తెలంగాణ ఎట్లైంది’పుస్తకావిష్కరణలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకు చేరుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం..ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పుస్తకాన్ని ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచాయని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించామన్నారు. ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రభుత్వ పనితీరును ఇలాంటి నివేదికలెన్నో తేల్చిచెప్పాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేసిన పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా తన సంపాదకత్వంలో పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు, సీఎం పీఆర్‌్‌ఓ రమేష్ హజారీ కృషిని మంత్రి కేటీఆర్ అభినందించారు.