– అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పకడ్బందీగా చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి మండల సభలు సమర్థవంతమైన వేదికగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభ నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రెవెన్యూ, విద్య, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా కాంతి పథకం, చేయూత పింఛన్ల అమలుపై అధికారులు వివరాలు వెల్లడించారు. సర్పంచ్లు, అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు, సలహాలు అందించారు.
వ్యవసాయ విభాగంపై అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యూరియా యాప్ను సమర్థవంతంగా వినియోగించి అవసరమున్న ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూడాలని సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ విభాగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, విద్యా విభాగంలో గ్రామాల్లోని ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తహసిల్దార్ ఆంజనేయులు, జిల్లా వైద్యాధికారి మనోహర్, సీఐ డి.యాదాద్రి, మండల పంచాయతీ అధికారి అనురాధ దేవి, పర్యవేక్షకులు హరిత దేవి, గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




