చక్కనైన కవిత్వానికి ‘ఇంకేం కావాలి’

'What more does good poetry need'?సాదే సురేష్‌ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించిన కవి. అతని కవితలు సామాజిక వ్యంగ్యం, తాత్విక చింతన, జీవిత సూక్ష్మగ్రహణతతో పాటు స్వేచ్ఛా ప్రేమను స్పందించే శైలిలో రచనలు చేస్తున్నారు. ప్రతి కవితలోనూ ప్రశ్నించే తత్వం, ఆలోచన శైలిని, సమాజాన్ని అద్దంపట్టే అద్భుతమైన దష్టితో కవిత్వాన్ని అందించారు. సామాజిక వ్యంగ్యాని తెలియజేస్తూ, టీచర్‌-ఎత్తితే బెత్తం/ పోతుంది భత్యం. భార్య-తెస్తుంది కట్నం/ అమ్మను వదిలి రమ్మంటుంది పట్నం. హీరోయిన్‌-కట్టదు చీర/ కట్టినా ఉల్లిపొర. రైతు-పండించేది వరి/ అది చేసిన అప్పుకు సరి. చెట్టు-నగరీకరణ పెరిగింది ఒక మెట్టు/ కనుమరుగు అయింది చెట్టు. పెంపకం-కూతురు ఇంట్లో మిక్సీ/ కొడుకు గాలిలో వేలాడే ఫ్లెక్సీ. షాంపు-అమ్మ మీద ఒట్టు/ ఊడగొడుతుంది జుట్టు. దార్శనికత-ఫిలాసఫీ ఉండాలి ఒంట్లో/ ఫిజిక్స్‌ ఉండాలి మన కంట్లో. సంస్కతి-చైనా అమ్మానాన్నది వన్‌ సంస్కతి/ అమెరికా విద్యార్థిది గన్‌ సంస్కతి. ఫ్యామిలీ ప్యాక్‌-ముందు పొట్ట/ వెనక తట్ట. ప్రవక్త-ఇజాలు మాట్లాడితే వక్త/ నిజాలు మాట్లాడితే ప్రవక్త. బతుకు చిత్రం-వేసవికాలం విద్యుత్‌ కోత/ వర్షాకాలం వీధులన్నీ రోత. చారిత్రక సత్యం-హిట్లర్‌ ఆయనకి పెళ్లి అంటే భయం/ మన పెళ్ళాలకంటే ఆయనే నయం. అల్లుడు-కర్మ. బిడ్డని ఇవ్వాలి/ కాపురానికి బెడ్‌ను ఇవ్వాలి. కులదేవత-బ్రాహ్మణులకు పప్పు/ దళితులకు డప్పు. అతిధి మర్యాద-పళ్లెంలో అన్నం/ పాన్‌ తో సున్నం. సురేష్‌ కవిత్వపు ప్రధాన అంశాల్లో సామాజిక అంశాలను సున్నితమైన హాస్య వ్యాఖ్యానాలతో సంకుచిత భావనలను ఎత్తిచూపుతూ, వాటిని వ్యంగ్యం ద్వారా విమర్శిస్తాడు. తాత్వికత, జీవిత సత్యాలు: నేను జైనుడినే/ నాలో నగత్వం చీకటి పడితే వచ్చింది కాదు/ చీకటి తొలగితే వచ్చింది. నేను బుద్ధుడిని/ రుద్దితే వచ్చింది కాదు / ప్రకతిని హత్తుకుంటే వచ్చింది. రాకెట్‌ ముందుకు పోతుంది/ అన్ని తగిలించుకుంటూ పోతే కాదు/ అన్నింటినీ వదిలించుకుంటూ పోతే. మా అమ్మాయి యు.కే.జీ. చదువుతుంది/ నేను యూనివర్స్‌ని చదువుతున్నాను. కాగితం ఎంతైనా సష్టించొచ్చు/ మూలం అయిన చెట్టును పుట్టించండి/ చెట్టుతో చుట్టరికం చేయండి. సురేష్‌ కవితల్లో తాత్విక ప్రశ్నలు సున్నితమైన పదాలతో మలచబడి ఉన్నాయి. రాకెట్‌ ముందుకు పోతుంది అన్ని తగిలించుకుంటూ పోతే కాదు అన్నింటిని వదిలించుకుంటూ పోతే అనే మాటల్లో జీవితానుభవాలను తాత్వికంగా వివరిస్తాడు. అతని భాష సౌకర్యంగా చాలా సులువుగా లోతైన అర్థాలను చెప్పగల సమర్ధత కనిపిస్తుంది. స్వేచ్ఛ ప్రేమ, అన్వేషణ: నా అక్షరానికి ఆల్కహాల్‌ మత్తు లేదు/ అక్షరాల గమ్మత్తు తప్ప/ ఇంకేం కావాలి?. అక్షరం/ దమ్మున్న పదం/ దమ్మ పదం. నా అక్షరానికి/ ఏ మతం లేదు/ ఏ మత్తు లేదు/ మరణం లేదు. ఇంకేం కావాలి?. నా అక్షరానికి/ జ్ఞానపీఠ్‌ అవసరం లేదు/ అనంతంలో కలిసే జ్ఞానం ఉంది. ఇంకా ఏదో కావాలి… స్వేచ్ఛ విహారం అనే ఆకాంక్ష అతని కవితల్లో పునరావతమవుతుంది. మానవుడి అంతరంగంలోని అసంతప్తి, స్వాతంత్య్రం కోసం తపించడాన్ని సురేష్‌ సజనాత్మకంగా వ్యక్తపరుస్తాడు. ఈ అంశం ఆధునిక మానవుడి మానసిక సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. వ్యంగ్యం, ఆనందమయ భాష: ఫిలింలో ఏముంది/ అంతా ఫీలింగ్‌ లోనే ఉంది. చెరుకు రసంలో ఏముంది/ చక్కని రసాయనం నీలో ఉంది. నాది కవిత్వం కాదు/ వాస్తవ జీవన చిత్రం. నా వాక్యం వ్యాయామం నేర్చుకుంది/ అటు తిప్పి ఇటు తిప్పి/ కూర్చోబెడుతుంది/ కావలసిన మనశ్శాంతి తెస్తుంది. నా అక్షరానికి ఆల్కహాల్‌ మత్తు లేదు/ అక్షరాల గమ్మత్తు తప్ప. నాకు జాబ్‌ ఉంది/ కానీ తప్తి పడనిజేబు వుంది/ ఇంకా ఏదో కావాలి. ప్రచారానికి ఫ్లెక్సీ ఉంది/ పచ్చడికి మిక్సీ ఉంది/ ఇంకా ఏదో కావాలి. డిక్షనరి ఉంది/ డాక్టరేట్‌ ఉంది/ ఇంకా ఏదో కావాలి. సురేష్‌ కవిత్వంలో హాస్యం ఉంది తత్వం ఉంది అన్నిటికి మించి వ్యంగ్య శైలిలో ఇమిడి ఉంది.
భాషా సౌందర్యం: సున్నితమైన పదాల ఎంపిక, ప్రవాహంతో కూడిన అందమైన పదాల వరవడి అతని కవితలకు సహజత్వాన్ని ఇచ్చాయి. సాధారణ జనజీవితంలోని భాషను కావ్యమయంగా మలచడంలో సురేష్‌ నిష్ణార్దుడు. సాదే సురేష్‌ కవిత్వం సమాజాన్ని మార్చే సాహసాన్ని, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే తత్వబోధన కనిపిస్తుంది. అతని వ్యంగ్యం కేవలం విమర్శ కాదు, సామాజిక మార్పు కోసం ఒక సాధనం. ‘కవిత్వం అనేది మనుషుల మనసుల్లో మార్పు తీసుకురావడానికి ఒక సాధనం’ అనే నమ్మకంతో అతని రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. పొదుపు జీవితానికే కాదు కవిత్వానికి కూడా ఆనందాన్ని విలువను సమకూర్చుతుందని, భాషా పరమైన అభినివేషాన్ని, అది వ్యక్తి నైపుణ్యాన్ని మరింత సాధన చేస్తూ సురేష్‌ శక్తివంతమైన కవిగా రాణిస్తున్నాడు. సమకాలిన తెలుగు కవిత్వంలోకి బుల్లెట్లా దూసుకువస్తున్న ఈ కవికి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు తన ముందుమాటతో సాదర స్వాగతం చెప్పారు. సురేష్‌ కవిత్వం నిత్య నూతన చైతన్య పతాకం.
– పూసపాటి వేదాద్రి, 9912197694

Spread the love