రష్యాపై యూరప్ దేశాలు యుద్ధానికి తలపడే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రస్తుతం ఒక చిక్కు సమస్యగా కనిపిస్తోంది. రష్యా యూరప్‌ను ఆక్రమించుకునే దురుద్దేశ్యంతో వ్యవహరిస్తోందంటూ యూరప్ దేశాలు పదేపదే చేస్తున్న ప్రచారం బొత్తిగా అర్ధం లేనిది. గతంలో అమెరికా గోర్బచేవ్‌కు ఇచ్చిన హామీ ప్రకారం నాటో తూర్పుదిశగా (రష్యా వైపుగా) విస్తరించేందుకు పూనుకోకూడదు. కాని, ఆ హామీని ఉల్లంఘించి రష్యాను రెచ్చగొట్టింది నాటో సభ్యదేశాలే. ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ పూనుకుని రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మిన్స్క్‌లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని భగం చేశాయి. ఆ ఒప్పందం గనుక అమల్లోకి వచ్చి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. రష్యాను ఎలాగైనా లొంగదీసుకుని అక్కడ ఉన్న సహజ వనరుల మీద తన పెత్తనాన్ని చెలాయించాలన్నదే నాటో దేశాల లక్ష్యం.బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్న స్వల్పకాలంలో పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు రష్యాను తమ పెత్తనం కిందకు తెచ్చుకోవచ్చునన్న కలలు కన్నారు. కాని ఆ కల ఎక్కువ కాలం నిలవలేదు. కాని వాళ్ల ఆశలు మాత్రం అలానే ఉన్నాయి. అందుకే ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ యూరప్‌ను ఆక్రమించు కుంటుందని అంటూ సాగించిన తప్పుడు ప్రచారాన్నే మళ్లీ ఇప్పుడు తలకెత్తుకున్నారు. అర్ధం పర్ధం లేని ఈ ఎత్తుగడ పైకి చూస్తే చిన్నపిల్లలాటలా కూడా అనిపిస్తోంది.
అయితే ఇక్కడో ప్రశ్న తలెత్తుతుంది.ఒకపక్క అమెరికా ఎలాగైనా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలన్న పట్టుదలతో ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంలోనే అంతర్లీనంగా రష్యా ఎటువంటి దురాక్రమణకూ పాల్పడ లేదని అంగీకరిం చినట్టైంది.అయినప్పటికీ, యూరప్ ఇంకా ‘రష్యా దురాక్రమణ’ ప్రచారాన్ని ఎందుకు కొనసాగిస్తోంది? ఈ ప్రశ్న ముఖ్యంగా జర్మనీ విషయంలో బాగా వర్తిస్తుంది. రష్యాపై ఆంక్షలు విధించిన కారణంగా గణనీయంగా నష్టపోయిన దేశం జర్మనీయే. అంతవరకూ చౌకగా లభిస్తున్న రష్యన్ ముడిచమురు బదులు ఖరీదైన అమెరికన్ ముడి చమురును కొనవలసివచ్చింది. దాని ఫలితంగా జర్మనీలో ఉత్పత్తి ఖర్చు బాగా పెరిగిపోయింది. దాంతో పరిశ్రమలు తమ ఉత్పత్తి కేంద్రాలను వేరే దేశాలకు తరలించడం ప్రారంభించారు. ఆ విధంగా జర్మనీలో పరిశ్రమలు మూత బడడంతో బాటు, అక్కడి ప్రజల జీవన వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం గనుక ముగిసిపోతే దాని వలన జర్మనీకి తక్కిన దేశాల కన్నా ఎక్కువగా ఊరట లభిస్తుంది.దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయినప్పటికీ జర్మనీ ఇంకా రష్యా మీద యుద్ధానికి కాలు దువ్వడం దేనికి?
ఈ పరిణామాలను బట్టి సామ్రాజ్యవాద దేశాల నడుమ వైరుధ్యం, పోటీ మళ్లీ తీవ్రమవుతున్నట్టు నిర్ధారణకు రాకూడదు. ఆయా బడా పెట్టుబడిదారీ ఆధిపత్య వర్గాల మధ్య శత్రుత్వం నెలకొనివుంటే అది సామ్రాజ్యవాద దేశాల నడుమ వైరుధ్యం పెరగడానికి దారితీస్తుంది. కాని ఇక్కడ అటువంటి శత్రుత్వం లేదు. రష్యా ఎడల అనుసరించ వలసిన వైఖరి విషయంలో వేర్వేరు దృక్పధాలున్నాయి. లెనిన్ వివరించినట్టు, బడా పెట్టుబడిదారీ కూట ములు వివిధ భౌగోళిక ప్రాంతాలపై ఆధిపత్యం కలిగివుండిన కాలంలో వాటి మధ్య శత్రుత్వం తలెత్తే అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం కొనసాగుతోంది.అందుచేత సామ్రాజ్యవాద దేశాల నడుమ వైరుధ్యం చడీచప్పుడూ లేకుండా ఉంటుంది. పైగా ఇప్పుడు జర్మనీ గాని, తక్కిన యూ రోపియన్ దేశాలు గాని రష్యాతో శాంతి సంధి కుదుర్చుకోవడం తప్ప ఘర్షణను కొనసాగించడం వలన ఎటువంటి ప్రయోజనాలూ పొందలేవు. పైగా, ఎంతకాలం పాటు ప్రస్తుత యుద్ధం కొనసాగినా, దాని ద్వారా రష్యాను ఓడించడం ఏ విధంగానూ సాధ్యం కాదు.
అయితే ఇక్కడ ఒక వాదనను చేయవచ్చు. అమెరికా రక్షణ ఛత్రం నీడలో ఇంతవరకూ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింది. ఇప్పుడు అమెరికా పక్కకు తప్పుకుంటానని అంటోంది. ఆ పరిస్థితిలో ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి యూరప్ దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచడం అవసరమే కదా. అలా చేయకపోతే, రేపొద్దున్న ఎటువంటి సంధి కుదిరినా, అందులో యూరప్ దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యం కాదు. అలా రక్షణ వ్యయం పెంచా లంటే సంక్షేమ చర్యల మీద చేసే ఖర్చు తగ్గించి ఆ మేరకు రక్షణ వ్యయాన్ని పెంచాలి. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజలకు సర్దిచెప్పి తమ చర్యను సమర్ధించుకోడానికి ”రష్యా దురాక్రమణ” ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి భారీ ద్రవ్యలోటును ఆమోదించదు. అటువంటి లోటు వలన ఆర్థిక కార్య కలాపాలు మందగిస్తాయని, పెట్టుబడిదారీ స్వేచ్ఛకు భారీ ద్రవ్యలోటు ఆటంకం అని అది భావిస్తుంది. అయితే ఒక పొరుగు దేశం నుండి ప్రమాదం ముంచుకొస్తోందన్నప్పుడు ఇటువంటి అభ్యంతరానికి అంతగా బలం ఉండదు. పైగా యుద్ధ ప్రయత్నాలు కూడా ఆర్థిక కార్యకలాపాలను, ఉపాధిని పెంచుతాయి. అందుచేత ద్రవ్యలోటు పెంచడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి గల అభ్యంతరాన్ని పక్కకు పెట్టవచ్చు. తాజాగా జర్మనీ తన రాజ్యాంగాన్ని సవరించి ప్రభుత్వ రుణ పరిమితిని పెంచుకోడానికి చట్టం చేసింది. యుద్ధ ప్రమాదం రష్యా నుండి పొంచివుందని ప్రచారం చేయడం ద్వారా సంక్షేమ చర్యలకు కోతలు పడినందువలన ప్రజల్లో తలెత్తే వ్యతిరేకతను కూడా చల్లార్చవచ్చు.
అయితే ఈ వాదన కొంతవరకూ సమంజసంగానే ఉన్నా, ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా వివరించడానికి ఇది సరిపోదు. రష్యాతో యుద్ధానికి కాలుదువ్వే ధోరణి యూరోపియన్ దేశాల్లో ట్రంప్ ఆధికారంలోకి రావడానికి మునుపే తలెత్తింది. పచ్చి మితవాద, నయా ఫాసిస్టు రాజకీయ కూటముల్లో కన్నా, మధ్యేవాద ఉదార బూర్జువా కూటములే ఎక్కువగా ఈ రష్యన్ ప్రమాదం గురించి చాలా బలంగా ప్రచారం చేస్తున్నాయి. ఉదాహరణకు జర్మనీలోని పచ్చి మితవాద పార్టీ ఎఎఫ్‌డి జర్మనీని మరింత సైనికీకరణ చేయడానికి గాని, ఆణ్వాయుధాలను సమకూర్చుకోడానికి కాని వ్యతిరేకించదు. బలంగానే సమర్ధిస్తుంది, కాని ఆ పార్టీ కన్నా ఎక్కువగా ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రాట్లు, ఫ్రీ డెమోక్రాట్లు, గ్రీన్స్, లేదా ఇటీవల విజయాలు సాధించిన క్రిస్టియన్ డెమోక్రాట్-క్రిస్టియన్ సోషల్ యూనియన్ కూటమి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఎక్కువగా రెచ్చిపోతున్నాయి. ఇటలీలోని నయా ఫాసిస్టు మెలనీ కాని, హంగరీలోని నయా ఫాసిస్టు ఓర్బన్ కాని ఈ విషఁయంలో అంతగా రెచ్చిపోవడం లేదు.
దీన్ని బట్టి ఒక నిర్ధారణకు రావచ్చు. నయా ఫాసిస్టు రాజకీయ శక్తులు ఆర్థిక సంక్షోభ సమయంలో బడా పెట్టుబడి ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసం ఏదో ఒక ‘అంతర్గత’ శత్రువును సృష్టించి (ఏదో ఒక మైనారిటీ తెగకు గాని మైనారిటీ మతానికి గాని చెందిన సమూహాన్ని) ప్రజల్లో ఆ శత్రువు పట్ల విద్వేష భావాన్ని రెచ్చగొట్టి వారి దృష్టిని ఆ వైపు మళ్లిస్తాయి. తద్వారా జీవన సమస్యల నుండి, నిరుద్యోగం వంటి సవాళ్ళనుండి వారి దృష్టిని తప్పిస్తాయి. అదే మధ్యేవాద ఉదార బూర్జువా రాజకీయ శక్తులు ‘బాహ్య శత్రువు’ వైపు ప్రజల దృష్టిని మళ్లిస్తాయి. ఇప్పుడు యూరప్‌లో రష్యాను అటువంటి బాహ్య శత్రువుగా చిత్రిస్తున్నది అందుకే.
ఇది ఈ మధ్య తలెత్తిన ఒక కొత్త ధోరణిగా భావించవచ్చు. ఈ మధ్యేవాద ఉదార బూర్జువా పార్టీలు తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోంచి బయటకు తేవడానికి ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన విధానాలు ఏవీ ఇప్పుడు పనిచేయడం లేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి వీలుగా ప్రభుత్వ వ్యయం పెంచుదామంటే అందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిబంధనలు అడ్డం వస్తున్నాయి. ఈ పార్టీలు కొన్ని దశాబ్దాల క్రితం ప్రవేశ పెట్టిన నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రజల్లో పెరిగిన నిరుద్యోగం, పేదరికం వలన వాటి ప్రజామద్దతు తరిగిపోతోంది. ఆ మద్దతును ఏదో ఒక విధంగా మళ్లీ కూడగట్టుకోవాలి. అందుకే ఇప్పుడు వాళ్లు ‘రష్యా ప్రమాదం’ బూచిని చూపిస్తున్నారు.
దీనితోబాటు ఆయుధాల పరిశ్రమాధిపతుల ఒత్తిళ్లు కూడా పని చేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ పరిశ్రమలకు బాగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు ఆ యుద్ధం ఆగిపోతే వారి లాభాలు తగ్గిపోతాయి. జర్మనీలోని ఒక ప్రముఖ ఆయుధ పరిశ్రమ సంస్థ ర్హైన్ మెటల్‌కు ఇంతవరకూ చేతి నిండా ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ రాజ్యాంగాన్ని సవరించి ఆయుధాల ఖర్చును పెంచడానికి పూనుకోవడం వలన ఆ సంస్థ మరికొన్ని సంవ త్సరాలపాటు ఆర్డర్లు పొందగలుగుతుంది. ”రష్యన్ దురాక్రమణ” ప్రచారం అందుకు తోడ్పడుతుంది.
అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ తనను తాను ఒక ”మానవీయ” వ్యవస్థగా మలుచుకోగలిగినట్టు చెప్పుకుంటూ కొనసాగుతూ వచ్చింది. ప్రజాస్వామ్య విధానాన్ని బలపరిచిన వ్యవస్థగా, సార్వత్రిక ఓటు హక్కును కల్పించిన వ్యవస్థగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. సంక్షేమానికి గణనీయంగా ఖర్చు చేస్తూన్నట్టు ప్రచారం చేసుకుంది. వలస విధానం ఉనికిలో లేదు కనుక సామ్రాజ్యవాద దోపిడీ దుర్లక్షణాలు తనలో ఏవీ లేనట్టు చెప్పుకుంటూ వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ తాను పూర్తిగా ‘మారిపోయానని’ చెప్పుకుంటూ కొనసాగింది.
కాని ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇటువంటి ప్రచారాలు చేసుకోడానికి సాధ్యం కావడంలేదు. ఎందు కంటే ఆ ‘మానవీయ’ లక్షణాలేవీ కొనసాగించడం సాధ్యం కావడం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్లీ తన కల్తీ లేని భయంకరమైన వికృత రూపంతో ముందుకు వస్తోంది. పెట్టుబడిదారీ ప్రపంచంలో నయా ఫాసిస్టు అణచివేత అక్కడ ప్రజాస్వామ్యాన్ని పక్కకు నెట్టివేస్తోంది. ఈ పరిణామం పట్ల సోషల్ డెమాక్రటిక్ పార్టీలు చాలా ఉదాసీనంగా వ్యవ హరిస్తున్నాయి. సంక్షేమ రాజ్యం అనే భావనను తోసిరాజనే విధంగా ఇప్పుడు ఆయుధాల ఖర్చును పెంచే చర్యలు చట్టబద్ధత పొందుతున్నాయి. మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్న సహజ వనరులపై, ముడి సరుకులపై సామ్రాజ్యవాద దేశాలు పట్టు చిక్కించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ట్రంప్ ఉక్రెయిన్‌ను, గ్రీన్‌ల్యాండ్‌ను తన ఆధీ నంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించడం, మరోపక్క గాజాను ఆక్రమించుకుని అక్కడ పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేస్తానంటూ ప్రకటించడం కూడా ఇందులో భాగమే. అందుచేత ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్లీ తన ‘మానవీయ’ రూపాన్ని సంతరించుకోగలుగుతుంది అని నమ్మడం అంటే సింహం గడ్డి మేస్తుందని నమ్మడం వంటిదే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్