‘మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడ నిర్భయంగా నడుస్తారో, అప్పుడే సంపూర్ణ స్వాతంత్య్రం సిద్ధించినట్టు’ అని మహాత్మాగాంధీ అన్న మాట ఇంకో వంద సంవత్సరాలు నిండినా వాస్తవ రూపం ధరించే పరిస్థితి మనదేశంలో కనపడటం లేదు. కనీసం పట్టపగలు కూడా మహిళలు ఒంటరిగా నడిచే పరిస్థితి లేదంటే ఆలోచించాల్సిన అంశమే. దీనికి ముఖ్యకారణం అబల అంటే చులకన భావం కలిగి ఉండటం. స్వతహాగా మనది పితృస్వామిక కుటుంబ నేపథ్యం. మన ఇతిహాసాలు, మత గ్రంథాలలో కూడా మగవారికే ఆధిపత్యం కల్పించుటచే వారిదే పైచేయిగా నేటికీ కొనసాగుతోంది. ఉన్నత చదువులు చదివిన మహిళలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైతం మగవారి చెప్పుచేతల్లో నడిచే పరిస్థితి నెలకొంది. కుటుంబంలో గానీ, సమాజంలో గానీ ఎక్కడ ఏరకమైన సంఘర్షణ జరిగినా, మొట్ట మొదటిగా మహిళలపై దాడులు చేయడం జరుగుతుంది. తాజాగా మణిపూర్ ఘటనల్లో కూడా మహిళలపైనే అఘాయిత్యాలకు పాల్పడ్డారు. నేడు ఏరోజు పత్రికలు, ఛానెల్స్ చూసిన పదుల సంఖ్యలో మహిళలు బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే విషయాలే ప్రసారమ వుతున్నాయి. ఇక కంటికి కనిపించని ఘాతు కాలు ఎన్నో కనిపెట్టలేము. షీ టీం, మహిళా పోలీసులు, దిశా పోలీసు స్టేషన్, దిశా ఏప్స్, నిర్భయ, పోక్సో, అనేక మహిళా సంక్షేమం, భధ్రత చట్టాలున్నా మహిళలకు భరోసా లేకపోవడం అత్యంత బాధాకరం. నేటికీ ‘మహిళా బిల్లు’ పార్లమెంట్లో ఆమోదం కాక పోవడం శోచనీయం. ఇప్పటికీ అనేకమంది మహిళలకు రక్తహీనత, అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. తిండికి గతిలేని స్థితిలో అనేకమంది స్త్రీలు భిక్షాటన, వ్యభిచార కూపంలోకి పోవడం ఎంతో బాధాకరం. ఇటువంటి అంశా లను పరిగణనలోకి తీసుకుంటే దేశంలో అత్యధిక మహిళలకు భద్రత ఏది, సాధికారత ఇదేనా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అయితే మన పాలకులు మాత్రం మహిళలు దేశంలో అన్నింటా అగ్రభాగాన ఉన్నారని ప్రగల్భాలు పలుకుతారు. ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో” మహిళా క్రీడాకారిణులైన రెజ్లర్లు” మాపై లైంగిక వేదింపులు జరుగుతున్నాయి అని నినదించినా సరైన న్యాయం జరగలేదు అని గ్రహించాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో కుల మత వర్గ వివక్షతలతో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లి పోతున్నాయి. మణిపూర్ ఘటనలు నేపథ్యంలో కనీసం వాస్తవాలు తెలుసుకోవడానికి సాక్షాత్తు దేశ ప్రధాని ఒకసారైనా నేటికీ ఆ రాష్ట్రం దర్శించకపోవడం గర్హనీయం. ఇకనైనా పాలకులు మహిళా, బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
– రావుశ్రీ