అరకొర బడ్జెట్‌తో వికలాంగుల సంక్షేమం సాధ్యమేనా?

On a shoestring budget Is the welfare of the disabled possible?కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి 0.025 శాతం నిధులు కేటాయించి దేశంలోని వికలాంగులందరినీ నిరాశ పర్చారు. 2016 వికలాం గుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్‌లో ఐదుశాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ ఉన్నా పట్టించుకోలేదు. వికలాంగుల సాధికారత శాఖకు కేటాయింపులు పెరిగినట్లు అంకెల్లో కన్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కేటాయించిన నిధుల్లో 2020-21లో 64శాతం, 2021-22లో 86శాతం, 2022-23లో 79శాతం, 2023-24లో 93 శాతం అసలు విడుదలనే చేయలేదు.2025-26బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే బడ్జెట్‌ను సవరించి ఐదు శాతం నిధులు కేటాయించి పూర్తిగా వాటిని వికలాంగుల కోసం ఖర్చు చేయాలని పోరాటం చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. కేంద్రం అర్భాటంగా ప్రారంభించిన సుగమ్య భారత్‌ అభియాన్‌తో పాటు వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే స్కీం ఫర్‌ ది ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ పర్సన్‌ విత్‌ డిజేబుల్స్‌ యాక్ట్‌ పథకానికి కేటాయింపులు మరింత తగ్గించింది. ఇది ఆందోళన కలిగించే అంశం. 2024-25లో రూ.135.33 కోట్లు కేటాయిస్తే, 2025-26 బడ్జెట్‌లో రూ.115.10 కోట్లు అంటే గతేడాదితో పోలిస్తే దాదాపు ఇరవై కోట్లు తగ్గించింది.
వికలాంగుల మానసిక ఆరోగ్యం గురించి వరుసగా రెండోసంవత్సరం ఆర్థిక సర్వే చేసిన హెచ్చరికలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. వీరికోసం ప్రత్యేకంగా అమలవుతున్న మెంటల్‌ హెల్త్‌ పోగ్రామ్‌ కోసం గత బడ్జెట్‌లో రూ.90కోట్లు కేటాయిస్తే 2025-26 బడ్జెట్‌లో 79.60 కోట్లకు తగ్గించింది. ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన తొంభై శాతం మంది వికలాంగులు పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల జనాభాలో కేవలం 3.8 శాతం మంది వికలాంగు లకే వర్తించే ఇందిరా గాంధీ నేషనల్‌ డిసబుల్డ్‌ పెన్షన్‌ స్కీం పథకం పరిధిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇది వికలాంగుల పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్న ది. 2016 ఆర్‌పిడి చట్టం గుర్తించిన 21రకాల వైకాల్యలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి ఎలాంటి చర్యలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్‌ కార్డు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టం కింద జాబ్‌ కార్డు ఇచ్చి 200రోజులు పనిదినాలు కల్పించాలని ఎన్నోరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వికలాంగులు పోరుబాట పట్టినా వీటిని కనీసం పరిశీలనకు కూడా కేంద్రం తీసుకోలేదు.
ప్రస్తుతం దేశంలో 2011 జనాభా లెక్కల్ని బట్టి చూస్తే 2.68 కోట్ల మంది, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ పేర్కొన్నట్టు పదహారు శాతం మంది వికలాంగులు న్నారు. ఈ సంఖ్యను గుర్తించడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. 2012 నుంచి పెన్షన్స్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ.300 మాత్రమే చెల్లిస్తున్నది. అదే సమయంలో నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినా, పెన్షన్‌ మాత్రం పెంచడం లేదు. వికలాంగులంటే మోడీ సర్కార్‌కు ఎందుకింత చిన్నచూపు? ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్‌ అనుసంధానం చేయాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. రాజస్థాన్‌ రాష్ట్రం మాదిరిగా పెన్షన్‌ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలి. కేంద్రం అసమర్ధత వలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌, 2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం, నేషనల్‌ పాలసీ, నేషనల్‌ ట్రస్ట్‌ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. 2016 ఆర్‌పిడి చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్‌ను రద్దు చేయాలి.2016 ఆర్‌పిడి చీఫ్‌ కమిషనర్‌, నేషనల్‌ ట్రస్టుకు పదకొండేండ్ల నుండి చైర్మన్లను నియమించడం లేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం వలన రిజర్వేషన్స్‌ అమలయ్యే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదలచేయాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. కేంద్రం వికలాంగులకు చేస్తున్న అన్యాయానికి నిదర్శనం ఈ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు. అందుకే డిమాండ్ల సాధనకు వికలాంగులు దీర్ఘకాలిక ఉద్యమానికి సన్నద్ధమ వ్వాలి. హక్కుల్ని,నిధుల్ని సాధించుకోవాలి.
– యం.అడివయ్య
9490098713

Spread the love