ఎందుకో వాళ్ళు అలా…

ఏ తల్లి కన్నీటి ప్రతిరూపాలో
ఏ నాన్న ఒడిలో మెసిలిన కుందేలు పిల్లలో
మిత్రుల మధ్య పేరుతో ప్రతిధ్వనించాల్సిన వాళ్ళు
ఇప్పుడు ఇలా ఫుట్‌పాత్‌ మీద అనామధేయులుగా
రోజొక నీళ్లు లేని మేఘంలా ఖాళీ కడుపుతో కనబడతారు
నూనె ఇంకిపోయిన చెమ్మెలాంటి కళ్ళతో,
ముత్తెమంత ఎదురుచూపు
అయిదు రూపాయల బువ్వ కోసం చాచిన ఖాళీ చేతులతో
నిజానికి ఎన్ని పుట్ల ధాన్యాన్ని చాటలతో
తూర్పారబట్టిన చేతులో అవి
ఎడ్లబండి మీద కూర్చొని మీసం మెలేసిన
వడ్లసంపద సష్టికర్తలో
బతికి చెడిన వాళ్ళో చెడిపోక బతికిన మనుషులో
బలామూ లేదు, బలగమూ లేదు
అన్నం పెట్టే అమ్మలూ లేరు, అన్నలూ రారు
ఇల్లులేదు, ఇల్లాలు లేదు, నవ్వుతరు, నటిస్తరు
పెదవులమీది నిశ్శబ్దపు బాధ చెప్పడానికి
ఒక భాష లేనివాళ్ళు, గూడులేని గువ్వపిట్టలు
క్యాల్‌ తప్పిన లోకానికి రాజులు
దినం కాలం చిటికెన వేలు పట్టుకొని నడిస్తే
వీళ్ళు సమయాన్ని లోలకమై తిరిగే
మనుషులను చూస్తూ ఖర్చు చేస్తారు
మందుల చిట్టీలు లేవు, షుగర్లు, బీపీలు తెలియవు
వెలిసిపోయిన బతుకుడాటలో
వీళ్ళు మాత్రం ఆల్చిప్పలో ఎదుగుదల ఆగిపోయిన
ముత్యం లాంటి వర్ణులు
(ఫుట్‌ పాత్‌ మీద జీవించే ఎందరో అనాధలకు…)
– వేముగంటి మురళి, 9392256475

Spread the love