చంద్రబాబుతో పోటీపడతా

చంద్రబాబుతో పోటీపడతా– అందుకు నాతోపాటు…అధికారులూ కష్టపడాల్సిందే
– శంషాబాద్‌లో హెల్త్‌ హబ్‌
– 500 నుంచి వెయ్యి ఎకరాల కేటాయింపు
బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ 24వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రోజుకు 18 గంటలు పని చేస్తారనీ, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని తెలిపారు. అందుకే ఇక మీదట తానూ 18 గంటలు పని చేస్తాననీ, రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనన్నారు. మనలో ఉన్న నైపుణ్యం బయటికి రావాలంటే నైపుణ్యమున్న ఆటగాడితో పోటీ పడాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
క్యాన్సర్‌ రోగులకు సేవలందించాలన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆలోచనలకు చంద్రబాబు సహకారం తోడై కోట్లాది మందికి సేవలందించారని రేవంత్‌ ఈ సందర్భంగా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పట్టుదలతో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేరును ఒప్పించి, మెప్పించి ఆస్పత్రికి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. బసవతారకం ఆస్పత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఎన్టీఆర్‌ కుటుంబంలో క్యాన్సర్‌ కారణంగా విషాదం అలుముకుందని, అలాంటి పరిస్థితి మరో కుటుంబంలో కలుగకూడదని ఆలోచించారని తెలిపారు. నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా తలపెట్టిన పని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ఎందరో నిరుపేదలకు సేవలందిస్తోందని ప్రశంసించారు. ఆస్పత్రి లీజ్‌తో పాటు ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకురాగానే పరిష్కరించినట్టు సీఎం గుర్తుచేసుకున్నారు.
ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదలకు సేవ చేయాలనే స్ఫూర్తిని తనతో పాటు అనేక మందిలో నింపిందని రేవంత్‌ గర్తుచేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆరోగ్యరంగంలో ప్రత్యేకంగా నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ఎలాంటి రోగానికైనా చికిత్స అందించేలా హెల్త్‌ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు శంషాబాద్‌ చుట్టూ 500 నుంచి వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆరోగ్య సంస్థలను ఈ హబ్‌కు ఆహ్వానించనున్నట్టు చెప్పారు. ఆ హబ్‌లో బసవతారకం ఆస్పత్రికి కూడా స్థలం కేటాయిస్తామని హామీనిచ్చారు. ఎన్టీఆర్‌ ఆలోచనలను చంద్రబాబు, బాలకృష్ణ కొనసాగించారనీ, ఇప్పుడు మూడో తరం లోకేష్‌, భరత్‌ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
బసవతారకం ఆస్పత్రి చైర్మెన్‌ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆస్పత్రి సేవలను మరింత ఎక్కువ మందికి అందించేందుకు విస్తరించనున్నట్టు తెలిపారు. తమపై నమ్మకంతో ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఆస్పత్రి ట్రస్ట్‌ బోర్డు చైర్మెన్‌ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రోగులకు మరిన్ని సేవలందించేందుకు ఆస్పత్రికి 10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్‌ బోర్డు సభ్యులు నోరి దత్తాత్రేయుడు, ఎం.భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love