నవతెలంగాణ-తుంగతుర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణన తప్పులతడకగా, గౌడ కులస్తులను అణగదొక్కే విధంగా ఉందని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. కోడి కూసిన కాడ కోటి మంది గౌడులు పుడతారనేది పరమేశ్వరుడు గౌడులకు పెట్టిన ఆశీర్వాదం”.దాని ఫలితంగానే ఏ గ్రామం, ఏమండలం, ఏ జిల్లా, ఏ రాష్ట్రంలో చూసినా గౌడుల జనాభా అధికంగా కనపడుతుంది. కానీ కొన్ని అగ్రకులాలు గౌడ జనాభాను తగ్గించి గౌడ్ లు రాజకీయం వైపు రాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన “అసమగ్ర సర్వే రిపోర్ట్”..
పూర్తిగా గౌడ కులస్తులకు వ్యతిరేకంగా ఉన్నదని అర్థమవుతుంది. గౌడు బలపడితే గ్రామం బలపడుతుంది-బహుజన వర్గాల గొంతు పెరుగుతుంది. కనుకనే ఆ గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. స్వాతంత్ర్యానికి ముందు 300 ఏళ్ల క్రితమే దొరలు, జమీందారులు, మొఘల్ వలస పాలకులకు వ్యతిరేకంగా బహుజన వర్గాలను కూడగట్టి ఇరవై ఒక్క కోటలు గట్టి,(1687-1724) 37 సంవత్సరాలు పరిపాలన చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలని అగ్రకులాలు ఇంకా మరిచిపోలేదు. ఆ భయం నేటికీ వారిని వెంటాడుతూనే ఉంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి రజాకారులపై సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలు, నేటి బీసీల అస్తిత్వ పోరాటంలో కూడా గౌడ కులం ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, ధన, మాన ప్రాణాలను కోల్పోయి పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటిది గౌడ కులం. గ్రామాలలో దొరలు, జమీందారులను తరిమి కొట్టి, కమ్యూనిస్టులతో కలిసి కీలకంగా పని చేసినటువంటి కులం గౌడ కులం.
సహజంగానే నిత్యం కల్లు అమ్మకాల ద్వారా డబ్బు కళ్ళజూసినటువంటి కులం గౌడ కులం. గ్రామాల్లో బడికీ,గుడికి,విగ్రహాలు పెట్టినా, కమ్యూనిస్టు పోరాటాలు చేసినా,బహుజన, సామాజిక ఉద్యమాలకు గౌడుల ఆర్థిక సాయం లేకుండా ఒక కార్యక్రమం నిర్వహించడం అసంభవం. ప్రజా పోరాటాలలో కమ్యూనిస్టు పోరాటమైనా,నక్సల్స్ పోరాటమైనా,భూమికోసం, భుక్తి కోసం, శ్రామిక జన విముక్తి కోసం జరిగిన పోరాటంలో వేలాదిమంది అసువులు బాసిన వారిలో మెజార్టీ ప్రజలు గౌడ కుటుంబాల నుండి వచ్చిన వారే. అందుకే గౌడ కులం అంటే అగ్రకులాలకు మింగుడు పడదు.యదేచ్ఛగా పేద ప్రజలను దోపిడీ చేస్తున్న అగ్రకుల,భూస్వామ్య వర్గాలను వీరోచితంగా ఎదుర్కోన్న చైతన్యం కలిగినటువంటి గౌడ్ నాయకత్వాన్ని గ్రామాల్లో మనం పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం.
తెలంగాణలో తొలిసారిగా ఉరి తీయబడ్డ గున్నాల కృష్ణ గౌడ్,200 మంది రజాకార్లను ఊచకోత కోసి జాతీయ జెండాను నిలబెట్టి,అమరుడైన బత్తిని మొగులయ్య గౌడ్,సాయుధ పోరాట దళాలని నడిపించిన బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్, చిన మల్లయ్య గౌడ్,నక్సల్బరి పోరాటాన్ని నడిపించి అమరులైన పులి అంజన్నగౌడ్,మాధవ్ గౌడ్, ఇంకా ఎంతోమంది గుర్తింపుకు నోచుకోని గౌడ అమరవీరులు ఉన్నారు.గౌడు ఎదిగితే పేద ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది.అది పాపన్న మహారాజ్ కాలంలోనే నిరూపించబడింది.గౌడు నాశనమైతే బహుజనుల గొంతుక మూగబోతుంది. కనుక గౌడుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని 70 ఏళ్లుగా అగ్రకులాలు చేయని కుట్ర లేదు.గౌడ ఆర్థిక మూలం కల్లు వృత్తి,కల్లు దుకాణాలు,తాటి, ఈత చెట్లు.వీటిని ధ్వంసం చేయడం, గౌడుల ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తే బహుజనుల పోరాటాలు నిలిచిపోతాయని కుట్రతో గత 70 ఏళ్లుగా కులవృత్తిని, కులాన్ని అణగదొక్కుతూనే ఉన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గౌడ కులాన్ని కాదనలేని,నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి వల్ల చట్టసభల్లో నలుగురు గౌడులకు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చి,50 లక్షల మంది గౌడుల పొట్ట కొట్టుతున్నారు.
ఎన్నికల అప్పుడు మేనిఫెస్టోలలో గౌడ సమస్యలను,ఆకర్షణీయమైన స్కీములను ప్రకటించి మోసం చేస్తున్నారు.గౌడ సంక్షేమాన్ని విస్మరించడం,గౌడులకు బడ్జెట్లో రూపాయి లేకుండా కుట్ర చేయడం,ప్రమాదాలకు గురైన గౌడులకు ఎక్స్గ్రేషియా రాకుండా అడ్డుకోవడం, గౌడ యువతకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశాలు రాకుండా ఆది నుంచే గొంతు నులిమే ప్రయత్నం జరుగుతుంది.అదే కాకుండా రెడ్డి, వెలమ అగ్రకులాలు గౌడ కులాన్ని మిగతా బీసీ కులాలకు శత్రువుగా చూపించడానికి ఎన్నో కుట్రలు నిరంతరం చేస్తూనే ఉంటాయి. అగ్రకులాలు చేసిన ఈ కుట్రలకు నమ్మి మోసపోయి బహుజన,బీసీ కులాలు గౌడ్ లను వ్యతిరేకించడం,గౌడ నాయకత్వాన్ని ధ్వంసం చేయడానికి అగ్రకులాలతో చేతులు కలిపాయి.
గౌడులు రాజ్యాధికారంలోకొస్తే అగ్రకులాల పీఠాలు కదులుతాయనే భయంతో గౌడ కులాన్ని టార్గెట్ చేసి,నాయకత్వాన్ని నాశనం చేసి,నేడు గౌడ జనాభాని మైనార్టీ కులంగా చూపించిన కుట్రల్ని ప్రతి గౌడ బిడ్డ ఖండించాల్సిందే.
రెడ్డి & గౌడ్
ఊరుకు ఒక్కరు, ఇద్దరూ కూడా కనిపించని అగ్రకులాలకు చెందిన రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కోమట కులాలను అధిక జనాభా కలిగిన కులాలుగా చూపించి, ఏ ఊరుకు వెళ్లినా 50 శాతానికి పైగా కొన్ని గ్రామాలు మండలాలు జిల్లాలలో 70 నుంచి 80 శాతం వరకు ఉన్నటువంటి గౌడ్ లను ఈ రాష్ట్రంలో మైనార్టీ గౌడులుగా చూపించే కుట్రల్ని బహుజన కులాలు తెలుసుకోవాలి. గౌడ జనాభాని తగ్గించి చూపించడం ద్వారా రెడ్డిల ఆధిపత్యాన్ని గౌడులు ఎదుర్కోలేరు అని ఒక సంకేతాన్ని పంపించడం, బహుజనులు అధికారం వైపు రాకుండా అడ్డుకోవడం కనిపిస్తుంది.
రాజకీయంగా చైతన్యం లేని కొన్ని కులాలను అధిక జనాభా ఉన్నట్లుగా…
రాజకీయంగా అధికారాన్ని అందుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటి గౌడ కులాన్ని మైనార్టీ కులంగా చూపించి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి రెడ్డిల నాయకత్వమే దిక్కు అని,రెడ్డిల జనాభా అధికమని,రాష్ట్ర భూములలో అధిక శాతం రెడ్డిల చేతుల్లోనే ఉన్నాయని కనుక రెడ్డిలని మీరు ఏమీ చేయలేరని ఒక హెచ్చరికను సమగ్ర సర్వే నిరూపించింది. దీనివెనుక రెడ్డి ఐఏఎస్ లు, రెడ్డి రాజకీయ నాయకుల కుట్ర ఉంది*
గౌడుల చాలెంజ్..
మీకు దమ్ముంటే గ్రామాల రిపోర్టు, మండలాలవారిగా రిపోర్టును విడుదల చేసి చూపించండి.మీరు చేసిన కుట్రలు ఈ ప్రపంచానికి అర్థమవుతాయి.రాష్ట్ర జనాభా జిల్లా జనాభా అని చెబితే ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం అసాధ్యం కనుక అంతవరకే పత్రికల్లో రిలీజ్ చేశారు.అధికారాన్ని అందుకోవడానికి దగ్గరగా ఉన్న గౌడ కులాన్ని స్పష్టంగా అణగదొక్కే ప్రయత్నం చేశారని మనకు అర్థమవుతుంది.
ఇంత దారుణాన్ని గౌడ కులానికి చెందిన బీసీ మంత్రి,గౌడ కులానికి చెందిన పిసిసి అధ్యక్షులను కూర్చోబెట్టి మన చేతుల మీదుగానే జనాభా లెక్కల సర్వే రిలీజ్ చేయించడం మన గొంతుకు మనమే ఉరివేసినటువంటి కుట్రలు చేసిన రెడ్డి, అగ్రకుల అహంకారాలు మనకు కనపడుతున్నాయి.
గౌడ బహుజనులారా మేల్కోండి!
ఈరోజు గౌడ కులానికి జరిగిన నష్టమే రేపు యాదవ్, ముదిరాజు, పద్మశాలి, మున్నూరు కాపు లాంటి కులాలు అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే నేడు గౌడ కులం పై జరిగిన దాడి లాగా మీ కులాలపై కూడా జరగవచ్చు. గౌడ కులాన్ని మైనార్టీ కులంగా చూపించినట్లుగానే, రేపు మీ కులాలను ఇదేవిధంగా తక్కువ చేసి చూపించి అనగదొక్కి,అధికారానికి దూరం చేసే కుట్రలు జరగనున్నాయి.నేడు గౌడు లపై జరిగిన దాడి బహుజన కులాలపై జరిగిన దాడిగా భావించి దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నా.. – తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్.



