Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలి

వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలి

- Advertisement -

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు
నవతెలంగాణ-తుంగతుర్తి
దేశంలో ఉన్న 20 కోట్ల వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు. ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభకు  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఈ మేరకు  దేశానికి తిండి పెడుతూ,సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 31 లక్షల భూమి ఉందని,ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున ఇవ్వాల్సి ఉందన్నారు.లక్షలాదిమంది ఇల్లు,ఇల్లు స్థలాలు లేక ప్రభుత్వం ఇస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ పాలకులు పేదలకు ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి,అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న,నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు.

భూమిలేని పేదలందరికీ ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే  ఎత్తడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే కూలి బందు పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని కోరారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశంలో రాష్ట్రంలో దళితుల, గిరిజనుల, మైనార్టీ, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. సామాజిక న్యాయం అమలు చేయాలని కోరారు. అందరికీ విద్య, వైద్యం ఉచితంగా కల్పించాలని కోరారు. ఉపాధి కూలీలను రెండు పూటల ఫోటో తీయాలనే  విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సూచించారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పనులు కల్పించి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కనీస వేతన చట్టాన్ని అమలు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు.పేదల అధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు.పాలకవర్గాలు సంక్షేమం పేరుతో ఓట్లను దండుకుంటూ అధికారంలోకి వచ్చాక సంక్షేమ రంగాన్ని సమాధి చేస్తుందన్నారు.వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వలన పని దినాలు తగ్గిపోయి కూలీలు,దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నూటికి 70 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు,పేద రైతులు పుట్టెడు కష్టంతో సంపదను సృష్టిస్తూ సమాజానికి భోజనం పెడుతున్న వీరికి,ఉండటానికి ఇల్లు,జబ్బు చేస్తే వైద్యం,పిల్లలు చదవాలంటే విద్య అందుబాటులో లేదన్నారు.

వీటితో పాటు అతివృష్టి అనావృష్టి వల్ల కూలీలకు పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని అన్నారు. అనంతరం గత మూడు సంవత్సరాలుగా తుంగతుర్తి మండల వ్యాప్తంగా నిర్వహించిన కార్యకలాపాల నివేదికను వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జాజుగల్ల ముత్తయ్య ప్రవేశపెట్టారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గౌరోజు గోవిందా చారి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి లక్ష్మి,దేవరకొండ యాదగిరి, శిగ శ్రీను,జాజుగల్ల ముత్తయ్య రైతు సంఘం మండల కార్యదర్శి మరిపెద్ది యాదగిరి,నాగయ్య, కొల్లూరి ముత్తయ్య,సర్వయ్య, ప్రజానాట్యమండలి నాయకురాలు తప్పెట్ల సుజాత,కొల్లూరి ముత్తయ్య,లక్కాకుల శీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -