‘వికలాంగుల సాధికారత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’

– తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ
నవతెలంగాణ – హిమాయత్ నగర్   
వికలాంగుల సాధికారత దృష్ట్యా జరిగే ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కన్వీనర్ డా.నారా నాగేశ్వరరావు కోరారు.జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్ నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో తిరిగి ప్రచార ముగింపు సభను ముగించారు. ఈ సందర్భంగా డా.నారా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వికలాంగుల జనాభా సుమారు రూ.20 లక్షలు, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 35 నుంచి 40 వేల వరకు ఓటు బ్యాంక్ ఉంటుందని, ఇది గెలుపు ఓటములను నిర్ణయిస్తుందన్నారు.జాతీయ, రాష్ట్రీయ కాంగ్రెస్ మేనిఫెస్టోలలో వికలాంగులకు సాధికారత, సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం చాలా అంశాలను చేర్చిందని గుర్తు చేశారు.గతంలో వికలాంగులకు సంక్షేమం, అభివృద్ధి పథకాలను, చట్టాలను రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకు తాము కాంగ్రెస్ కు మద్దతిస్తున్నామన్నారు. ‘వికలాంగుల సాధికారత సాదిద్దాం’ అనే నినాదంతో తెలంగాణ వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి తెలంగాణ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి, పత్రికా సమావేశాలు నిర్వహించి వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో వికలాంగులకు, సకలాంగులకు వివరించి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మే 13న జరిగే ఎన్నికల్లో ఓటెయ్యాలని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. చివరగా మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో పర్యటించి ముగింపు సమావేశం అంబేద్కర్ విగ్రహం వద్ద ముగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ డిసేబుల్డ్ ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నాగభూషణం, అభిల భారత దివ్యాంగుల ఐక్యవేదిక అధ్యక్షులు పల్లెబోయిన సుధాకర్, ప్రతినిధులు సిహెచ్.జంగయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love