ఆరోగ్యకరమైన అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకోండి

– యశోద వైద్య నిపుణులు డాక్టర్‌. ధర్మేష్‌ కపూర్‌
– నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం
నవతెలంగాణ-బేగంపేట్‌
కాలేయ వ్యాధులు మానవులలో సంభవించే మరణాలకు 14వ సాధారణ కారణమని.. అత్యంత కీలకమైన ఈ అవయవ ప్రాధాన్యతను తెలియజెప్ప టానికి ఏప్రిల్‌ 19ని ప్రపంచ కాలేయ దినంగా ప్రకటించడం జరిగిందని. సీనియర్‌ హెపటా లజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌ డాక్టర్‌. ధర్మేష్‌ కపూర్‌ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ సంవత్సరం ప్రపవంచ వ్యాప్తం గా అన్ని దేశాలు పాటిస్తున్న ఈ వరల్డ్‌ లివర్‌ డే లక్ష్యం వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం కాపాడుకోవటానికి కాలేయాన్ని పరిరక్షించుకోవడం, దానిని దెబ్బదీసే వ్యాధులను గూర్చి ప్రజలకు అవగాహన కలిగిం చడం. కాలేయం మన జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న అతి పెద్ద గ్రంధి. ఇది 500 పైగా ప్రాణాధార విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే, తాగే, వేసుకునే మందులు కూడా చివరకు కాలేయం గండా ప్రయాణించాల్సిందే. జీర్ణమయిన ఆహార పదార్థాలు, కరిగి కలిసిపోయిన మందులతో కూడిన రక్తన్ని జాగ్రత్తగా వడబోసే కాలేయం దానిలో ప్రమాదకర రసాయనాలను తొలగించి వేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్దం చేస్తుంది. కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపు చేస్తుంది. జీర్ణక్రి యకు తోడ్పడే పైత్యరసం(బైల్‌)ను విడుదలచేస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేయం వ్యాధులకు గురై దెబ్బదింటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించటం, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం ద్వారా కాలేయాన్ని కాపాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
అన్నిరకాల ధాన్యాలు, కాయగూరలు, పళ్లు, పాల ఉత్పత్తులతో కూడిన ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకొండి. క్రమం తప్పకుండా వారంలో 5 రోజుల పాటు రోజుకు 30నిమిషాల పాటు వ్యాయామం చేయండి. మద్యం-ధూమ పానానికి దూరంగా ఉండండి. ఏవైనా మందులు వేసుకొనే ముందు డాక్టరును సంప్రదించండి. ఔషధాలను అధిక మొత్తంలో వాడటం, వేర్వేరు మందులను వాడేటపుడు కలయికలో పొరపాటు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బదీస్తాయి. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. వైరసుల వల్ల వచ్చే హెపటైటిస్‌ వ్యాధి సోకకుండా ఉండేందుకు వాక్సినేషన్‌ చేయించుకొండి. ఏరకమైన లక్షణాలు కనిపించకుండానే ఈ వ్యాధి సోకి కాలేయానికి నష్టం కలిగించగలదు. హెపటైటిస్‌ ఎ., బి. వైరసులకు వాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న పక్షంలో తప్పని సరిగా ప్రతీ ఏడాది కాలేయానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొండి. వాటి ఆధారంగా డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం” అని తెలిపారు.

Spread the love