చదువులో, వృత్తిలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వీరి జీవితాలు మనకేం చెబుతున్నాయి. అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామంటున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యతే కొనసాగింది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసినా వారి గురించి సమాజానికి పెద్దగా తెలియదు. వారు సాధించిన ఘన విజయాలు నేటి యువతను ఈరంగంవైపు ఆకట్టుకుంటున్నాయి. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్ష రహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ సందర్భంగా సైన్స్‌లో మహిళా భాగస్వామ్యం ఎలా ఉందో తెలుసుకుందాం…
అమ్మాయిలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం విద్యారంగంలో అమ్మాయిలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలి. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.
స్ఫూర్తి ప్రదాతలుగా…
దశాబ్దాల కిందటే సామాజిక కట్టుబాట్లను, కష్టాలను ఎదుర్కొని సైన్స్‌లో తమదైన ముద్రవేసిన మహిళలు స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నారు. తొమ్మిదేండ్ల బాల్యంలోనే పెండ్లి చేస్తే, 14ఏండ్ల వయసుకే తల్లై, కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దు:ఖాన్ని దిగమింగి డాక్టర్ కావాలని సంకల్పించిన అపూర్వ విద్యావతి ఆనందీబాయి జోషి. అమెరికాలోని పెన్సిల్వేనియా మెడికల్ కాలేజీలో 1886లోనే పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళ ఆనందీబాయి. సైన్స్ చదవాలని, పరిశోధనలు చేయాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రవేశానికి కమలా సోహ్ని ఆరాట పడితే కేవలం మహిళ అన్న కారణంగా ఆమెకు ప్రవేశం నిరాకరించబడింది. సి.వి.రామన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె డాక్టరేట్ పూర్తి చేశారు. రామన్ మార్గదర్శకత్వంలో మొట్టమొదటి పిహెచ్.డి పొందిన ప్రప్రథమ మహిళా శాస్త్రవేత్త కమలా సోహ్ని. సత్యేంద్రనాథ్ బోస్, ప్రఫుల్లచంద్ర రే వంటి ఉద్దండుల మార్గదర్శనలో రసాయన శాస్త్రంలో పిహెచ్.డి చేసిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందిన ఆసిమా ఛటర్జీ మొక్కల్లో ఉండే ఔషధాలను కనుగొన్నారు. కర్ణాటకలో తొలి మహిళా ఇంజనీరుగా పనిచేసిన రాజేశ్వరి ఛటర్జీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మిచిగాన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. భారత వైజ్ఞానిక సంస్థలో తన భర్తతో కలిసి ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేసిన విజ్ఞానవేత్తగా ఆమె ప్రసిద్ధికెక్కారు.
అద్భుత విజయాలు
భారతదేశంలో గణిత పరిశోధకుల్లో మేటిగా పేరుగాంచిన మంగళ నార్లీకర్ గణితాన్ని సులభతరం జేసి మనసుకు హత్తుకునేలా బోధించేవారు. పెండ్లయిన పదహారేండ్లకు ఆమె గణితశాస్త్రంలో పిహెచ్.డి చేశారు. వీరేగాక ఇటీవలి కాలంలో ఎందరో మహిళలు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఇస్రో రాకెట్ శాస్త్రవేత్త నందిని హరినాథ్ తన ఇరవై ఏండ్ల సర్వీసులో 14మిషన్స్‌లో పనిజేశారు. మంగళ్‌యాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. రక్షణ రంగ పరిశోధనల్లో పరిశోధనలు చేసి ‘అగ్ని’ క్షిపణి ప్రాజెక్టులకు నేతృత్వం వహించిన మహిళ టెస్సీ థామస్. క్షిపణి ప్రయోగాలను విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన టెస్సీని ‘క్షిపణి మహిళ’, ‘అగ్నిపుత్రి’గా పిలుస్తారు. మహికో విత్తన సంస్థలో పరిశోధనలు చేసిన ఉషా బార్వాలే తొలి జన్యుమార్పిడి ఆహారపంట వంగను ఉత్పత్తి చేస్తే.. జన్యుమార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి వచ్చే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచలనం సృష్టించారు సుమన్ సహారు. ఈమే ‘జీన్ క్యాంపేయిన్’ను స్థాపించి స్థానిక ప్రజల, రైతుల హక్కుల కొరకు, కార్పొరేట్ల నుండి వారికి రావలిసిన వాటా రాబట్టేందుకు విశేష కృషి చేశారు. అంటార్కిటికాను సందర్శించిన తొలి మహిళా శాస్త్రవేత్త అదితి పంత్. కృత్రిమ గర్భధారణ పిండాల ప్రక్రియలను సుసాధ్యం చేసిన వారు ఇందిర హిందూజా. అంతరిక్షనౌక కొలంబియా ప్రయోగ ప్రమాదంలో చనిపోయిన మిషన్ స్పెషలిస్టు కల్పనా చావ్లా… ఇలా ఎందరెందరో మహిళా శాస్త్రవేత్తలు వైజ్ఞానిక పరిశోధనలను సమున్నతం చేసి ప్రఖ్యాతిగాంచారు.
సముచిత స్థానం కల్పించాలి
ఎన్ని విజయాలు సాధించినా సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదు. స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత వుందో అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగంగా ఉన్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా సైన్సేకాదు ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయటానికి సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించవలసి ఉంది. బాలికలను సైన్స్ పట్ల ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవటం ఎంతైనా అవసరం. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్షా రహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి చేయూతనిస్తుంది.