Sunday, September 6, 2026
E-PAPER
Homeమానవిమహిళలూ.. ఆరోగ్యం జాగ్రత్త...

మహిళలూ.. ఆరోగ్యం జాగ్రత్త…

- Advertisement -

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా 35 ఏండ్లు దాటిన మహిళల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి. అయితే శరీరంలో కనిపించే ప్రతి మార్పుకూ హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణమని తేలిగ్గా కొట్టిపారేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అసాధారణ మార్పులు అంతర్గతంగా దాగి ఉన్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సూచికలు కావచ్చు. కాబట్టి ఈ వయసులో తమ శరీరంలో వచ్చే మార్పుల్లో ఏవి సాధారణం? ఏవి అసాధారణం? అన్న విషయాల్లో ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ముఖ్యం. మరి, అవేంటో ఈరోజు తెలుసుకుందాం...

ముఫ్పై అయిదేండ్లు దాటిన కొంతమంది మహిళలు చిన్న పనులకే నీరసించిపోతుంటారు. ఇందుకు వయసు పెరిగే కొద్దీ ఇంటి బాధ్యతలు పెరిగిపోవడం, వీటితో పాటు ఆఫీస్‌ పనులను బ్యాలన్స్‌ చేసుకోలేక సతమతమైపోవడం లాంటివి కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి బిజీ లైఫ్​లో అరటిపండ్లు, ఓట్స్‌, నట్స్‌, గింజలు, కోడిగుడ్లు, ఆకుకూరలు వంటి శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవాలి.

ప్రీ-మెనోపాజ్ మార్పులు
కొంతమంది మహిళల్లో 35 ఏండ్లు దాటాక ప్రి-మెనోపాజ్‌ లక్షణాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీటివల్ల రాత్రి పూట నిద్రపట్టకపోవడం, ఒక్కసారిగా మెలకువ వచ్చి శరీరమంతా చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఇది సహజమే అయినా నిద్రలేమి వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లకూడదంటే.. పడుకొనే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం, సంగీతం వినడం, అలాగే రోజూ కచ్చితమైన నిద్రవేళల్ని పాటించడం మంచిది. అలాగే ఈ వయసులో కొంతమంది మహిళల్లో పీరియడ్స్ విషయంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా బ్లీడింగ్‌ తక్కువగా అవ్వడం, ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ వంటివి కనిపిస్తుంటాయి. ముందస్తు మెనోపాజ్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందని గుర్తించాలి.

హార్మోన్ల మార్పులు
వయసు పెరిగే కొద్దీ చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు రావడం, చర్మం పొడిబారడం, సాగే గుణాన్ని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. 35 దాటిన మహిళల్లోనూ ఇవి సహజమేనని అంటున్నారు. అలాగే హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం వంటి లక్షణాలూ కొందరిలో కనిపిస్తాయి.

ఎముకల ఆరోగ్యం
సాధారణంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఎముకల సమస్యలు, కీళ్ల నొప్పులు రావడం సహజం. వయసు పైబడే కొద్దీ శరీరం మనం తీసుకునే ఆహారం నుంచి క్యాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోవడం దీనికి ఒక ముఖ్య కారణం. దీంతో పాటు శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా ఎముకలు తమ దృఢత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి క్యాల్షియం అధికంగా లభించే సోయా ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఆకుకూరలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, శరీరానికి అవసరమైన విటమిన్ డి కోసం చేపలు, ఉడికించిన కోడిగుడ్లు వంటి వాటిని రోజువారీ మెనూలో చేర్చుకోవడం ఎంతో మంచిది.

జీర్ణ సమస్యలు
35 ఏండ్లు దాటిన కొందరు మహిళల్లో అజీర్తి, గ్యాస్ట్రిక్‌, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలూ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లలో హెచ్చుతగ్గులు, జీవనశైలి మార్పులే వీటికి కారణం. కాబట్టి ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, చిక్కుళ్లు, పప్పులు, గింజ ధాన్యాలు వంటివి ఎక్కువగా తినాలి. రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు కొద్ది మొత్తంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీటిని నిర్లక్ష్యం చేయకూడదట
వయసు పెరిగే కొద్దీ నీరసం, అలసట రావడం సహజమే అయినప్పటికీ.. అవి పదే పదే కనిపిస్తున్నా లేదా తీవ్రంగా ఉన్నా అసాధారణంగా పరిగణించి వెంటనే డాక్టర్లును సంప్రదించాలి. అప్పుడే ఈ సమస్యలకు కచ్చితమైన కారణాలను తెలుసుకొని, సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోగలరు.
35 ఏండ్ల వయసులో కొంతమందిలో ఒక్కసారిగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి మార్పులను గమనిస్తుంటాం. చాలామంది ఇందుకు తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం లేదా శారీరక శ్రమ లేకపోవడమే కారణం అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అలా నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కచ్చితంగా డాక్టర్లును సంప్రదించి సలహా తీసుకోవడం తప్పనిసరి.
బ్లీడింగ్‌ మరీ ఎక్కువైనా, తక్కువైనా, నెలల తరబడి పీరియడ్స్‌ రాకపోయినా ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ లక్షణాలు కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలకు సూచిక కావచ్చు.
ముందస్తు మెనోపాజ్‌ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌స్వింగ్స్‌ వంటివి సహజమే. అయితే ఇవి తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే వెజైనా వద్ద నొప్పి, వైట్‌ డిశ్చార్జి ఎక్కువవడం వంటి లక్షణాలకు కొన్నిసార్లు ప్రి-మెనోపాజ్‌ కారణమైనప్పటికీ.. మరికొన్ని సందర్భాల్లో వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇతర సమస్యల ముప్పూ పొంచి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
కాబట్టి.. ప్రతి మహిళా తమ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. తమ ఆరోగ్య సమస్యల గురించి నిస్సంకోచంగా డాక్టర్లతో మాట్లాడటం వల్ల.. ఆ సమస్యల తీవ్రత పెరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే, అవసరమైన చికిత్సను సకాలంలో పొంది ఆయా అనారోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

హార్మోన్ల మార్పులను గమనించే స్మార్ట్ పరికరాలు

మహిళల ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు రుతుక్రమం తేదీలను క్యాలెండర్‌లో గుర్తు పెట్టుకోవడం లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికే పరిమితమైన డిజిటల్ సాయం, ఇప్పుడు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులను అంచనా వేసే స్థాయికి చేరుతోంది. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ఉంగరాలు, చర్మానికి అమర్చే సూక్ష్మ సెన్సర్లు వంటి ధరించగలిగే పరికరాలు శరీరంలో జరిగే జీవక్రియ మార్పులను నిరంతరం నమోదు చేస్తూ, రుతుచక్రం, అండోత్సర్గం, మెనోపాజ్, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
​రుతుక్రమం వెనుక ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ వంటి హార్మోన్లను నియంత్రించే ఇతర హార్మోన్ల సమన్వయం ఉంటుంది. వీటిలో వచ్చే మార్పులతో శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన, నిద్ర, ఆకలి, మానసిక స్థితి, శక్తి స్థాయిల్లోనూ మార్పులు కనిపిస్తాయి. కృత్రిమ మేధ సహాయంతో విశ్లేషించి వ్యక్తిగత ఆరోగ్య అంచనాలను అందిస్తున్నాయి. ప్రతి మహిళ శరీరం భిన్నంగా స్పందించడంతో వ్యక్తిగత ఆరోగ్య నమూనాలను రూపొందించే దిశగా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ​ఈ సాంకేతికత సంతానోత్పత్తి ప్రణాళికకూ దోహదపడొచ్చు. అండోత్సర్గం, గర్భధారణకు అనుకూల సమయాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించడంలో తోడ్పడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే రుతుచక్రంలో అసాధారణ మార్పులు, నెలసరి ఆలస్యం, హార్మోన్ల అసమతుల్యత వంటి సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించేందుకు సూచనలు ఇవ్వగల సామర్థ్యాన్ని కూడా ఈ పరికరాలు సంతరించు కుంటున్నాయి.
​మెనోపాజ్ దశలో హార్మోన్ల మార్పుల వల్ల వేడి ఆవిర్లు, అధిక చెమటలు, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం, మానసిక అస్థిరత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిరంతరం గమనించడం ద్వారా సమస్య తీవ్రతను అంచనా వేయడంలో, చికిత్స ఫలితాలను పరిశీలించడంలో వైద్యులకు ఇవి ఉపయోగపడవచ్చు. అలాగే అండాశయ సమస్య, థైరాయిడ్ సమస్యలు వంటి హార్మోన్ల సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశాలపైనా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
​అయితే ఈ పరికరాలకు పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా పరికరాలు హార్మోన్లను నేరుగా కొలవవు. హార్మోన్ల ప్రభావంతో శరీరంలో జరిగే మార్పులను మాత్రమే నమోదు చేస్తాయి. అందువల్ల ఇవి ఇచ్చే సమాచారం ఒక సూచన మాత్రమే. వైద్య పరీక్షలకు లేదా వైద్యుల సలహాకు ఇవి ప్రత్యామ్నాయం కావని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -