భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా
రెండోస్థానంతో రెండోరౌండ్‌లోకి…
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్
ఆమ్‌స్టెల్వీన్(నెదర్లాండ్స్): ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పటిష్ట ఇంగ్లండ్‌ను సమర్ధవంతంగా నిలువరించింది. ఏకంగా 8పెనాల్టీ కార్నర్‌లను గోల్ కాకుండా భారత మహిళల డిఫెండర్లు అడ్డుగోడగా నిలిచారు. దీంతో వాఘెనర్ హాకీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన కీలక పోరులో భారతజట్టు 0-0తో డ్రా చేసుకొంది. దీంతో పూల్-డిలో భారత మహిళలజట్టు 2వ స్థానంలో నిలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన కీలక పోరులో ఇరుజట్లు గోల్స్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు రెండోరౌండ్ బెర్త్ ఖాయం కానుండడంతో ఆ జట్టు పలుమార్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల దాడులను భారత డిఫెండర్లు, గోల్ కీపర్ సవిత సమర్ధవంతంగా తిప్పి కొట్టారు. ఇక సలీమా తేతే నేతృత్వంలోనే భారతజట్టు ఇంగ్లండ్‌పై గోల్ చేసేందుకు 6 పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటన్నింటినీ భారత్ నిష్ప్రయోజనం చేసుకొంది. ఇక 42వ నిమిషంలో ఇషికా చౌదరి గ్రీన్ కార్డుకు గురై కొంతసేపు మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
ఇరుజట్ల జరిగిన ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత మహిళలజట్టు పూల్-డి నుంచి 3మ్యాచ్‌లు ముగిసేసరికి 5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి రెండోరౌండ్‌కు చేరగా.. చైనా 7పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్(4పాయింట్లు), దక్షిణాఫ్రికా(0) 3, 4 స్థానాలో నిలిచాయి. ఈ పూల్‌లో భారత మహిళల జట్టు పటిష్ట చైనాతో తొలి మ్యాచ్‌ను 2-2 డ్రాతో ప్రారంభించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 6-1 తేడాతో చిత్తుగా ఓడించి రెండో రౌండ్ రేసులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాపై సాధించిన ఆ విజయం భారత్‌కు బలమైన గోల్ డిఫరెన్స్‌ను సాధించడంలో సహాయపడింది. చైనా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం జరిగిన పూల్-డి చివరి లీగ్ మ్యాచ్‌లో చైనా అదరగొట్టింది. ఆ జట్టు 5-1గోల్స్‌తో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ మహిళలపై 4-2తో గెలుపుతో ఆ జట్టుకు టాప్ బెర్త్ ఖాయమైంది. గురువారం జరిగిన పురుషుల మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 7-1తో న్యూజిలాండ్‌ను చిత్తు చేయగా.. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ -2తో డ్రా అయ్యింది.



