సమ్మె చేస్తున్న కార్మికుల..

Workers on strike– న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
– నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మహిళా కార్మికుల పోరుకేక
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా.. పోరాడే కార్మిక సంఘాలపైనే అభాండాలు వేస్తూ పోరాటాలను చులకన చేస్తూ మాట్లాడటం సరికాదని, మంత్రులు, అధికారులు తమ ధోరణి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, వారం రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్‌ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ హాజరై మాట్లాడారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను పెంచి ఉద్యోగులు, కార్మికులు, సాధారణ, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. ధరలకనుగుణంగా వేతనాలు సవరించకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు పని భారం పెరిగి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులు.. పోరాటాలు నిర్వహిస్తుంటే.. ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు పోరాడే వారిని చులకన చేసే పద్ధతుల్లో మాట్లాడటం సరికాదన్నారు. కార్మికులు పాలకుల దయాదాక్షిణ్యల మీద ఆధారపడాలనే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కార్మికుల తరపున పోరాడే నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే, ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జై శంకర్‌ గౌడ్‌, నూర్జహాన్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రమేష్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకట్రాములు, అధ్యక్షులు గంగాధర్‌, కేవీపీఎస్‌ నాయకులు కొండ గంగాధర్‌, నాయకులు అనిల్‌, విగేష్‌, జంగం గంగాధర్‌, పి స్వర్ణ, చంద్రకళ, రాజమణి, బాలమణి, పెద్ద ఎత్తున ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు.

Spread the love