సమగ్రమైన వేతన ఒప్పందం కోసం కార్మికులు ముందుకు రావాలి….

– ఐఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ గౌడ్ పిలుపు..
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ 
సమగ్రమైన వేతన ఒప్పందం కోసం కార్మికులు ముందుకు రావాలి అని ఐ ఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో మార్చి 29న జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి, టి ఎన్ టి యు సి కార్మిక సంఘాలు బలపరిచిన సి ఐ టి యు ఉదయించే సూర్యుని గుర్తుపై కార్మిక వర్గం అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించాలని ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రీమియర్ ఎక్స్ ప్లోజీవ్స్ అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. కంపెనీ ఆవరణలో కార్మికులను కలిసి మాట్లాడుతూ గతంలో గుర్తింపు సంఘంగా ఐ ఎన్ టి యు సి మద్దతుతో ఎన్నికైన బిఎంఎస్ యాజమాన్యంతో జరిగిన వేతన ఒప్పందంలో యాజమాన్యం ఒప్పుకున్న డబ్బుల నుండి రాత్రికి రాత్రే రెండు లక్షల రూపాయలు తగ్గించి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని గుర్తు చేశారు. కంపెనీలో గుర్తింపు సంఘం గా ఉన్న బిఎంఎస్ యాజమాన్యంతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, టిఆర్ఎస్ కెవి సంఘాన్ని ఏర్పాటుచేసే సమయంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, వైద్య సేవల కోసం కృషి చేస్తామని చెప్పిన నేతలు వారు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కార్మికులకు అదనపు భారాన్ని పెంచారని ఆరోపించారు. టిఆర్ఎస్కెవి నాయకునిగా పనిచేస్తున్న వట్టిపల్లి వెంకటయ్య యూనియన్ అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డిని వేతన ఒప్పందంపై కలిసి చర్చించేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కనీసం వెంకటయ్యకు న్యాయం చేయకపోగా, వెంకటయ్య కు న్యాయం కోసం ఆందోళన చేసిన కార్మికులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత గొంగిడి మహేందర్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. మహేందర్ రెడ్డికి కార్మిక చట్టాలపై అవగాహన లేకపోవడంతో కార్మికులకు ఎంతగానో ఉపయోగపడే పిఎఫ్ సీలింగ్, ఈడిఐఎల్, బోనస్ కోతలు పెట్టి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వర్గానికి సమగ్రమైన వేతన ఒప్పందం చేసి, గత వేతన ఒప్పందాలలో కోల్పోయిన హక్కులను తిరిగి పునరుద్ధరించేందుకు రానున్న గుర్తింపు ఎన్నికలలో కార్మిక వర్గం సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి గౌరవ అధ్యక్షులు సుడుగు జీవన్ రెడ్డి, సిఐటియు ప్రధాన కార్యదర్శి చెక్క రమేష్, హెచ్ఎంఎస్ నాయకులు కర్రె సత్యనారాయణ, ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి పాపకారి రాజిరెడ్డి, టిఎన్టియుసి నాయకులు రేగు బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love