ప్రభాతభానుడి తొలికిరణం
నేలను స్పశించేలోగానే
కొన్ని పక్కలు
అలవాటు కొద్దీ
ముడుచుకుపోతారు
కొన్ని చీపుర్లు
నిలువు కళ్లేసుకుని
చెత్త జాడలను వెతుకుతారు
మనుషుల
కడుపులోకి చేరాల్సినవాటిని
తమ కడుపులో దాచుకుని
కొన్ని గిన్నెలు
కుతకుత ఉడుకుతుంటారు
కొన్ని భుజాలు
పనిముట్లకు ఆసరా అవుతాయి
ఉదరఘోషకు పరిష్కారాన్ని
కొన్ని చేతులు
స్టీలు డబ్బాలో కప్పిపెడతాయి
ప్రయాణ ఖర్చులతో
జేబు బరువుకు
సమతూకం కుదిరిందో లేదో
అంచనా వేసే మెదడు
దూరం-సమయం గ్రాఫును
గాలిలోనే గీసి పారేస్తుంది
గడప దాటే కాళ్లు
చెప్పులను
ఆభరణాలుగా మార్చుకుంటారు
ఒక శ్రమజీవి పయనం
ప్రారంభమవుతుంది
– డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839