ఎట్లాగూ నడుస్తూనే ఉన్నాం
అమూర్తంగా ఏదో ఓ దిక్కు ఎందుకు నడవాలి
చూపును సవరించి వెలుగులు పూచే
ఎడమ వైపుకే నడవాలె-
ఎట్లాగూ మాట్లాడుకుంటూనే ఉంటాం
అర్థ రహితంగా ఏదో ఒకటి ఎందుకు మాట్లాడుకోవాలి
మాటకు మహిమనద్దుతూ చీకటిని ఊడ్చే
సూర్య రశ్మి గురించే ముచ్చటించుకోవాలె-
ఎట్లాగూ వింటునే ఉంటాం
బధిర బంధురంగా ఏదో ఒకటి ఎందుకు వినాలి
చేతనను చెవిన పరికిస్తూ
త్యాగచరితుల స్ఫూర్తి పుటలనే చెవిన ధరించాలె-
ఎట్లాగూ పాడుతూనే ఉన్నాం
శ్రుతి శుభగమంటూ ఏదో మాయాగీతాన్ని ఎందుకు పాడాలి
కంఠానికి కోతపడినా సరే
ఆశయాలు ఉగ్గుపట్టే మట్టిపాటలే పాడాలె-
ఎట్లాగూ కలుసుకుంటూనే ఉంటాం
నిద్రాణంగా ఎవరినో ఒకరిని ఎందుకు కలవాలి
నాగలి భుజాన వేసుకుని
మహోపాధ్యాయుడు మార్క్స్ కలల్ని మోస్తున్న
రైతు దరికే చేరాలె –
ఎట్లాగూ యుద్ధమే చేస్తున్నాం
ఏకాకిగా తోడా తోడా ఎందుకు పోరాడాలి
క్రూర ఆధిపత్యాలపై రగల్ జెండాయెత్తి
సమిష్టిగా సంపూర్ణంగానే కొట్లాడాలె –
విలువలకు తిలోదకాలిస్తున్న
కార్పోరెట్ కాలమిది –
వివక్ష కాలనీల రూపం దాల్చి
విషం చిమ్ముతున్న ఆటోమేషన్ యుగమిది –
పెట్టుబడి Trust me, I am liying’ అంటూ
ఉన్న ఆ కాస్తా చెలకమూలను దోచేస్తున్న సబర్బన్ ఋతువిది-
అంబేద్కర్ చెప్పినట్టు ఇప్పుడు ఆయుధాల కంటే
అక్షరాలతోనే మనకు ఎక్కువ పని.
– డా.బెల్లి యాదయ్య, 98483 82690