విధ్వంస రచన

చెట్టుంటేనే కదా ఓ పిట్ట వాలేది ,
పిట్టను చూసే కదా పది పక్షులు పేరంటానికి వచ్చేది .
గోరువంకల గుసగుసలు , కోకిల గానాలు, నెమలి నాట్యాలు,
పచ్చని భూతల్లి గుండెల మీదనే గదా పల్లవించేది .
నీటి కుంటలు, పిల్ల కాలువలు …
నగరానికెంత దూప తీరుస్తున్నాయో చూశావా..?
మీ రోడ్డు మోటర్లు వదిలే పొగను పీల్చుకొని
మీ గుండెలకెన్ని టన్నుల ఆక్సీజన్‌ ను అందిస్తున్నాయో …
ఎప్పుడైనా గమనించావా..?
అహాలనూ, అధికారాలనూ వదిలి,
ఒంటరి బాటసారివై ఓసారి అడవిలో తిరిగి చూడు.
సైనికుల్లా బారులుగా సాగే ఎర్ర చీమలు ,
ఈత చెట్టుకు అల్లుకున్న దుసరి తీగల హొయలు,
కొలను పక్క జువ్వి చెట్టుమీద గుడ్డి కొంగల కాపురాలు ,
మద్ది చెట్టు కొమ్మల మీద నెమలి క్రీంకారాలు,
గరక పాకిన మైదానం మీద లేడి పిల్లల దుంకులాట,
జిట్టరేగి పొదలో చుట్టుకున్న పాము, కుందేలు సోపతి .
పరుపు బండలు, నిగిడిన గుండ్లు,
చినుకు పడితే అడవి వెదజల్లే సుగంధాలు ,
ఓ సారి గుండె నిండా కండ్లు చేసుకొని చూడు ,
ఎన్ని ఇంద్రధనస్సులు, మరెన్ని స్వర్గ సీమలు కనిపిస్తాయో..?
తన సంతానాన్ని భూమిపై చల్లి,
విస్తరించే అడవి తల్లి మన బాగు కోసమే గదా ప్రేమను పంచేది.
ఎన్ని కరెన్సీ నోట్ల కట్టలు ఖర్చు చేసినా ఓ అడవిని సష్టించగలమా ..?
భూమంటే రియల్‌ ఎస్టేటని, అడవంటే ఆక్రమించునదని
రాజకీయ దళారుల వద్ద పాఠాలు నేర్చుకున్న
కలల బేహారులకేమి తెలుసు…
మనిషికీ, అడవికీ ఉన్న అనుబంధం.
అధికారమంటే … అమ్మకం, కొనుగోళ్లుగా మారిన ప్రజాస్వామ్యంలో
వన్య ప్రాణుల ఎలిజీలను బుద్ధి జీవులే గదా వినగలిగేది .
విద్యార్థి ప్రసూనాల నిరసనలను,
వన ప్రేమికుల ఆలోచనలను అవలోకించండి
మీ బుల్డోజర్‌ ఆదేశాలను తగలేయండి.
అడవిని వన్యప్రాణులతో మననీయండి.
– పుప్పాల కష్ణ మూర్తి, 9912350345

Spread the love