భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు 72 ఏండ్ల సీతారాం ఏచూరి తీవ్ర శ్వాస సంబంధ వ్యాధితో పోరాడి, సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచాడు. రాజకీయ రంగ ప్రముఖులు, ఆయన కార్మిక వర్గానికి, రాజ్యాంగానికి, సామాజిక న్యాయానికి, సమానత్వానికి కట్టుబడి ఉన్న తీరును గుర్తుచేసుకుంటూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. తన స్నేహితులచేత ‘సీత’ అని పిలవబడే సీతారామ్ 1970వ దశకంలో వామపక్ష కోట బురుజు లాంటి జవహర్ లాల్ నెహ్రూ యూని వర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థిగా రాజకీయాల్లో తనదైన ముద్రవే శాడు. 1977-1978 మధ్య కాలంలో ఆయన మూడు పర్యాయాలు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎమర్జెన్సీ అనంతర పోరాటాలు, ఆటంకాల వల్ల తన పదవీ కాలంలో విరామం ఏర్పడింది కాబట్టి ఆయన, తరువాత ఆ కాలాన్ని తన సహజమైన రీతిలో హాస్యంతో చమత్కారాన్ని జోడించి వర్ణించేవాడు. ఆ కాలంలో ఆయన కూడా కొద్ది కాలంపాటు నిర్బంధంలో ఉన్నాడు. తరువాత 1980 వ దశకంలో ఆయన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)కి అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
ఒక పార్లమెంట్ సభ్యునిగా తన పాత్రను పోషించినందుకు, మతతత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భిన్న రాజకీయ శక్తుల్ని ఒకే తాటిపై తెచ్చినందుకు అందరూ ఏచూరిని గుర్తుంచుకొని, స్తుతిస్తారు. ఆచరణాత్మక కమ్యూనిస్టుగా బహుము ఖాలు గల తన ప్రయాణంలో ఇవి కొన్ని మాత్రమే.ఆయన జేఎన్‌యూలో ఉన్న సంవత్సరాలలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాన్ని రూపొందించిన రాజకీయ వెల్లువ, సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌లో కష్ణా భరద్వాజ్, ఇతరులతో కలిసి ఆయన అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి తోడైంది. అది ఆయన రాజకీయ దష్టికోణం అభివద్ధికి అవసరమైన నేపథ్యాన్ని ఏర్పరిచింది. ఆయన భారతీయ వ్యవసా యంపై పరి శోధన ప్రారంభించాడు, కానీ పూర్తి చేయలేదు. అయితే ఆయన పరిశోధన తొలి దశల ప్రాతి పదికపై రాసిన పత్రం 1976లో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పత్రికలో ప్రచురితమైంది.
ప్రజ్ఞా పాటవాల సీతారాం
ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుండి చెన్నరు (అప్పుడు మద్రాస్) వచ్చిన కుటుంబంలో పుట్టాడు. ఆయన పెరిగింది, పాఠశాల విద్యనభ్యసించింది హైదరాబాద్‌లో. ఫలితంగా ఆయనకు హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలు బాగా తెలుసు. ఆయన ఉన్నత విద్య కోసం ఢిల్లీ చేరి, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో పట్టభ ద్రుడయ్యాడు. ఏచూరి సీబీఎస్‌ఈ పరీక్షల్లో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంతో విశిష్టమైన అకడమిక్ రికార్డు దక్కింది. టెన్నిస్ కూడా ఆడే సీతారాం పాత హిందీ సినిమా పాటల్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. వాటితో అప్పుడప్పుడు కూని రాగాలు తీసేవాడు. ఆయన అందర్నీ సమానంగా చూసేవాడు.
మరో సిద్ధాంత ఆచరణవాది, పార్టీ నాయకుడు ప్రకాష్ కారత్‌కు సీతారాం జూనియర్. ఎస్‌ఎఫ్‌ఐ నినాదమైన ‘చదువు-పోరాడు’,’అందరికీ విద్య’ అనే లక్ష్యం కోసం జీవించిన తరువాత తరాల వారికి వీరిరువురు తొలితరం మార్గదర్శకులు. దాని గురించి ఏచూరి చాలా ముందుగానే బాగా ఆలోచిం చాడు. చాలా సంక్లిష్ట భావాలు ప్రజల భాషలో అందించగలిగేవాడు. ఆయన సంక్లిష్టమైన సిద్ధాంతాల్ని ప్రజాక్షేత్రంలో ఉపయోగించేవాడు కాదు. అపరిచిత పదజాలంతో నిండిన భాషను సరళం చేయడం ద్వారా, వర్గ పోరాటాలతో ప్రజాసమస్యల్ని లేవనెత్తడం ద్వారా మాత్రమే వామపక్ష ఉద్యమం, వామపక్ష రాజకీయాలు ప్రజలకు చేరువ అవుతాయని ఆయనకు తెలిసింది. జగద్విదితమైన ఆయన మంచి, స్నేహ స్వభావాన్ని స్నేహితులు, ఆయనతో బాగా అనుబంధం ఉన్నవారు నెమరేసుకున్నారు. ఏచూరి అందరికీ తెలుసిన నాయకుడు, కానీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రజా నాయకుడు కాదు. ఆయన అర్థరహిత వాగాడంబర భాషను ఉపయోగించే వాడుకాదు. ఆయన ప్రసంగాలు సంభాషణా శైలిలో ఉండేవి. ఆయన వాదనల్లో ఉపయోగించే భాష అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండేది.
సీతారాం రాజకీయ ప్రయాణం
విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం, 1970 దశకం మధ్యలో సీపీఐ(ఎం)లో చేరి, పార్టీలో ఒక ‘రెయిజింగ్ స్టార్’ గా ఎదగడానికి దారితీసింది. 1980లలో ఎస్‌ఎఫ్‌ఐ పత్రిక ‘స్టూడెంట్స్ స్ట్రగుల్’ కు సంపాదకునిగా పనిచేశాడు. ఆయన పదవీ కాలంలో ఆ పత్రిక ఒక నూతన స్థాయికి చేరింది. తన సాహసకార్యంలో ఏచూరి ప్రముఖ నాటక కర్త, దర్శకుడు అయిన సఫ్దర్ హష్మి మద్దతును కూడా కూడగట్టాడు.
ఈ సమయంలోనే నాటి ప్రభుత్వ ‘ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘ డాక్యుమెంట్ బయటపడింది. నాడు ‘నూతన విద్యా విధానం’ పేరుతో దేశంలో విద్యా విధానం మార్పుకు అది నాందీ పలికింది. అదే చివరికి ‘1986 విద్యపై జాతీయ విధానం’ గా మారింది. ఈ విధానం పై తీవ్ర విమర్శలు చేయడంలో,దానిని ప్రతిఘటిం చడంలో ఏచూరి ముందున్నాడు.
సీపీఐ(ఎం)లో చేరిన పది సంవత్సరాల తరువాత ఏచూరి, 1985లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత సంవత్సరాలు కమ్యూనిస్టులకంతా సంక్షోభం కాలం : మిఖాయిల్ గోర్బచెవ్ పురోగ మనం, సోవియట్‌లో ప్రవేశపెట్టబడిన గ్లాస్ నాస్త్, పెరిస్ట్రోయికా సంస్కరణలు, తియాన్మేన్ స్క్వేర్ సంఘటన, బెర్లిన్‌గోడ కూల్చివేత, చివరికి సోవియట్ యూనియన్‌లో, తూర్పు యూరప్‌లో సోషలిస్ట్ వ్యవస్థ పతనం లాంటి సంక్షోభాలు. వామపక్షాలు ప్రపంచ వ్యాప్తంగా, ఆంతరం గికంగా తీవ్రదాడికి గుర య్యాయి. ఈ సంఘటనల నుండి ఒక్క సారిగా ఉత్పన్నమైన భావజాల పరమైన సవాళ్లు, చర్చల్లో ఏచూరి దఢంగా నిలబడ్డాడు.
తప్పిదాలు జరిగి ఉండవచ్చు కానీ సోషలిజానికే భవిష్యత్తు ఉంది. ఆయన ఎప్పుడూ ఈ పరిణామాలను మార్క్సిస్ట్ చట్రంలోనే విశ్లేషించి, ఈ ప్రశ్నలపై సీపీఐ(ఎం) దక్పథాన్ని రూపొందించడంలో భాగస్వామి అయ్యాడు. దేశంలో భిన్న మతాల, భిన్న భావాల మిశ్రమాన్ని సోదాహరణంగా నిరూపించేందుకు, ఏచూరి పార్లమెంట్ ప్రసంగాల్లో తరచుగా ‘ఇండియా’ అనే ‘భారత్’ లాంటి ప్రస్తావనలు ఉండేవి. ఈ వక్కాణింపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 2014లో అధికారం చేపట్టిన తరువాత మాత్రమే బాగా పెరిగింది. మైనార్టీలపై దాడులు సాధారణ మయ్యాయి. ఆయన చదువుకున్న జేఎన్‌యూని ప్రస్తుత పాలకవర్గం అన్యాయంగా లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు పార్లమెంటులో దానిని రక్షించే ప్రయత్నం చేశాడు. విద్యాసంస్థలపై దాడి జరిగినప్పుడు, రాజ్యాంగాన్ని బలహీనపర్చినపుడు, దళితులు, మైనారిటీల హక్కుల రక్షణ కోసం, ఉన్నత విద్యాసంస్థల స్వతంత్రతను రక్షించే సందర్భంలో కూడా ఆయన అదే రీతిలో స్పందించి నొక్కి చెప్పేవాడు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ బూర్జువా పార్టీలైనప్పటికీ, బీజేపీ నుండే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే వాస్తవాన్ని కూడా ఆయన గ్రహించాడు. మారిన పరిస్థితులు, ప్రాథమిక భావజాలం విషయంలో రాజీపడకుండా వ్యూహాత్మక కూటములను నిర్మించే అవసరాన్ని వేగిరపరిచాయనే భావన పెరిగింది.
2014 తరువాత పార్లమెంట్‌లో తమ ప్రభావం తగ్గినప్పటికీ, సీపీఐ(ఎం) నాయకత్వంలోని వామపక్ష పార్టీలు ఇప్పటికీ అదుపు చేయగలిగే నైతిక బలాన్ని కలిగి ఉన్నాయి. ఒక లౌకిక మూడో ఫ్రంట్‌ను నిర్మిస్తేనే సరిపోలేదు. నయా ఉదారవాద సంస్కరణల ప్రారంభం నుండి అసమానతల్ని పెంచిన ఆర్థిక విధానాలకొక ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాజకీయ పార్టీల మధ్య వర్గ వైరుధ్యాలు న్నప్పటికీ ఇదెలా సాధ్యమైందంటే, ఏచూరి బిగుతైన తాడు (టైట్‌రోప్)పై అవలీలగా నడవడం నేర్చుకున్నాడు కాబట్టే సాధ్యమైంది. మొదటి యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కొన్ని విధానాలు, చర్యల్లో, కనీస ఉమ్మడి కార్య క్రమం ఏర్పాటులో వామపక్షాల ముద్ర ఉన్న విషయం రహస్యమేమీ కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ‘ఇండియా’ బ్లాక్‌లో, దాని సంబంధిత పార్టీల పెరుగుదలలో కూడా ఈ ముద్ర కొనసాగింది.
భిన్న ధ్రువాలుగా ఉండే రాజకీయ పార్టీల్ని పరస్పరం సంభాషించేట్లు చేసి, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటులో అందర్నీ ఒకేతాటిపైకి తెచ్చిన ఏచూరి సామర్థ్యాన్ని అనేక మంది నివాళులు అర్పించే సందర్భంలో కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాలు వేరువేరు కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన రాజకీ యాలే అపరిమితంగా రూపుదిద్దాయి. సోషలిజం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటి పరిస్థితు ల్లోనూ మారకుండా అలాగే ఉండిపో యింది. అందుకే ఆయన అందరికీ ఆదర్శంగా గుర్తుండి పోతాడు.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
– టి.కె.రాజ్యలక్ష్మి