నిన్న గుజరాత్‌..ఇపుడు ఢిల్లీ

Yesterday Gujarat..now Delhi– ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్‌ జోన్‌లో అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పిల్లల ఆస్పత్రిలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు. మరో ఐదుగురు శిశువులు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లో ఉన్న బేబీ కేర్‌ న్యూ బోర్స్‌ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యజమాని డాక్టర్‌ నవీన్‌ కిచ్చిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఢిల్లీలో మరిన్ని ఆస్పత్రులనూ నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. గాయపడిన శిశువులకు వేరే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అందోళన కరంగా ఉన్నట్టు సమాచారం. మృత దేహాలను పోస్టుమార్టర నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఘటనాస్థలంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. జనమంతా గుమిగూడి.. వీడియోలు తీసేందుకు ఎగబడటంతో సహాయక చర్యలకు విఘాతం కలిగింది. అదేవిధంగా.. నీటి లభ్యత లేకపోవడం, తక్కువ ఎత్తులో విద్యుత్‌ వైర్లు ఉండటం కూడా అగ్ని మాపక సిబ్బందికి ఇబ్బంది కలిగించింది.
‘ఆస్పత్రిలో శనివారం రాత్రి 11.30 సమయంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. మొత్తం 12 మంది నవజాత శిశువులను హాస్పిటల్‌ వెనుక కిటికీలోంచి బయటకు తీసుకొచ్చాం. వారిలో ఏడుగురు మరణించారు. మరో అయిదుగురు చికిత్స పొందుతున్నారు’ అని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ సిలిండర్ల పేలుడుతో మంటలు మరింత వేగంగా వ్యాపించినట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. ‘అమాయక శిశువులను కోల్పోయిన తల్లిదండ్రులకు అండగా ఉంటాం. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారెవర్నీ విడిచిపెట్టం’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ కూడా ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో స్పందించారు.

Spread the love