– పోటీలో ‘ఎర్రబెల్లి’, ‘రెడ్యా’
– ఈసారి పోటీ ప్రతిష్టాత్మకం..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వర్గీయ యతిరాజారావు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. తాజా ఎన్నికల్లో ఈ రికార్డును సమం చేయడానికి అదే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు నేతలు పోటీలో ఉన్నారు. వారే బీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్న పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్. ఇప్పటికే వీరివురూ 6సార్లు విజయం సాధించగా, 7వసారి విజయం సాధిస్తే ‘యతి’ రికార్డును సమం చేసినట్టే. దాంతో ఎర్రబెల్లి, డీఎస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వర్గీయ నెమరుగొమ్ముల యతిరాజారావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలో ఉన్న చెన్నూరు నియోజకవర్గం నుంచి యతిరాజారావు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొడకండ్ల మండలం వడ్డేకొత్తపల్లికి చెందిన యతిరాజారావు తొలిసారి 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1962లో సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1975 ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 1978, 1983ల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
అనంతరం టీడీపీలో చేరిన యతిరాజారావు 1985, 1989, 1994లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో యతిరాజారావు రోడ్లు, భవనాల శాఖతోపాటు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆరుసార్లు వరుసగా గెలిచిన ‘ఎర్రబెల్లి’
తొలుత వర్ధన్నపేట నియోజక వర్గం నుంచి 1994లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరుసగా 1999, 2004ల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వయ్యింది.
ఈ క్రమంలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి 2009, 2014లోనూ టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2018లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కేబినెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లోనూ 7వ సారి బీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెడ్యా
డీఎస్ రెడ్యానాయక్ తొలిసారి డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1994, 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ చేతిలో ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2018లో ఆ పార్టీ నుంచి గెలుపొందారు.
తాజాగా ఏడోసారి ఎన్నికల బరిలోకి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. డీఎస్ రెడ్యానాయక్ వైఎస్ కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.