నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చౌక్ ఆవరణంలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తహసీల్దార్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం మధ్య మండల తహసీల్దార్ ఎండీ ముజీబ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండాలు రెపరెపలాడాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాడవాడలా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో మద్నూర్ మండల కేంద్రంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.



