అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఎంపీ ఆర్‌ కృష్ణయ్య

– బీసీ బిల్లుకు మద్దతిస్తానని యూపీ మాజీ సీఎం హామీ
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ – పార్లమెంట్‌ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ పార్టీ పార్లమెంటులో పూర్తి మద్దతు ఇస్తుం దని సమాజ్‌ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం అఖిలేష్‌ యాదవ్‌ను వారి కార్యాల యంలో కలిసి పార్లమెంటులో పార్టీ తరుపున బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని కృష్ణయ్య చేపట్టిన ఉద్యమానికి పార్టీ పరంగా పార్లమెంట్‌ ఉభయసభలలో పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇతర పార్టీల నాయకులతో కూడా మాట్లాడి బీసీ బిల్లుకు మద్దతు కూడాగడతామని తెలిపారు. ఆర్‌ కష్ణయ్య మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించలేదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఇవ్వవలసిన వాటా ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, న్యాయ రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. బి.సి సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో బి.సి. కులాల వారీగా లెక్కలు సేకరించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love