అదానీ వ్యవహారానికి దేశభక్తి ముసుగు

 – విచారణకు ఆదేశిస్తే తప్పేంటి?
– ఎస్వీకే వెబినార్‌లో ఆర్థికరంగ విశ్లేషకులు డీ పాపారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో       

హిండెన్‌ బర్గ్‌ నివేదికతో పోయిన ప్రతిష్టను కాపాడుకొనేందుకు ఆదానీ, బీజేపీ నానా అవస్థలు పడుతున్నాయని ప్రముఖ ఆర్థికరంగ విశ్లేషకులు డీ పాపారావు అన్నారు. హిండెన్‌బర్గ్‌ను షార్ట్‌ టెల్లర్‌, బ్లాక్‌మెయిలర్‌గా బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. 2020-21లో అదానీ షేర్లకు ఒకేసారి 80 శాతం మార్కెట్‌ పెరిగిందని గుర్తుచేశారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో శనివారం ”అదానీపై హిండెన్‌బర్గ్‌ నివేదిక-ఆర్థిక రంగంలో దాని పర్యవసానాలు” అంశంపై వెబినార్‌ జరిగింది. ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు. డీ పాపారావు ప్రధాన వక్తగా మాట్లాడుతూ…అదానీ షేర్లను హిండెన్‌బర్గ్‌ ఉద్దేశ్యపూర్వకంగా పడిపోయేలా చేసి, ఆ షేర్లను అదే సంస్థ తిరిగి కొనుగోలు చేసి, ఆ తర్వాత లాభాలు ఆర్జిస్తుందనీ, గతంలో ఇలాగే పలు కంపెనీల షేర్లు పడిపోయేలా చేసిందంటూ బీజేపీ శ్రేణులు అదానీ పక్షాన ప్రచారం మొదలుపెట్టారన్నారు. హిండెన్‌ బర్గ్‌కు విదేశీ ముద్ర వేసి, అదానీని దేశభక్తుడిగా కీర్తిస్తూ, అదేదో దేశంపై దాడి అన్నట్టు చిత్రీకరిసున్నారని చెప్పారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ నోరుమెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తే, కేంద్రానికి జరిగే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా, ప్రధాని మోడీ సమాధానం చెప్పకపోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నారు. సంపద పలువురి చేతుల్లో ఉంటే పెట్టుబడులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నట్టనీ, కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే ప్రజల సొమ్ముకు భద్రత ఎక్కడ ఉంటుందన్నారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలతో ఆదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించిన పరిస్థితులపైనా విచారణ జరగాలన్నారు. కోవిడ్‌ సమయంలో చైనా నుంచి పలు వస్తువుల ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయాయనీ, ఆ ప్రభావం అనేక దేశాలపై పడిందన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని తయారు చేయాలని కేంద్రం ‘మేకిన్‌ ఇండియా’ నినాదం ఇచ్చిందన్నారు. అయితే ఆ ప్రయత్నం బెడిసి కొట్టిందని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారతదేశంలో పెట్టేకంటే వియత్నాం, కంబోడియాల్లో పెట్టడం శ్రేయస్కరంగా భావిస్తున్నా రని విశ్లేషించారు. దీనికి కేంద్రంలోని ప్రభుత్వం తన అనుకూలురకు మాత్రమే వ్యాపార అనుమతులు ఇవ్వడం కారణమన్నారు. అదానీ, అంబానీని కాదని ఇతరులకు అవకాశాలు ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. అందువల్లే ఎఫ్‌డీఐలు రావట్లేదని వివరించారు. అదానీ-హిండెన్‌బర్గ్‌కు మధ్య ఏవైనా వైరుధ్యాలు, విభేదాలు ఉంటే, అవి వారి వ్యక్తిగతమనీ, దానికీ, జాతీయత, దేశభక్తికి సంబంధం ఏంటన్నారు.

Spread the love