అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

–  రైతుబీమా పథకంలో రైతు పేరు నాట్‌ ఎన్రోల్డ్‌
నవతెలంగాణ- యాలాల
అప్పుల బాధతో ఓ యువరైతు పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం బండమీదిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబీకులు, ఎస్‌ఐ అరవింద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లే అంజిలయ్య (35), బొల్లే పార్వతమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికున్న మూడెకరాల వ్యవసాయ పొలంతో పాటు, ఇతరుల ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ రబీలో వేరుశనగ, వరిపంటలు వేశాడు. కొంతకాలంగా పంటల సాగుకు దాదాపు రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన మేరకు పంటల దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు, వాటికయిన వడ్డీలు పెరిగాయి. దాంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి వేరుశనగ పంట కల్లం దగ్గరే తన భార్యా పిల్లలతో కలిసి పడుకున్న అంజిలయ్య.. అర్ధరాత్రి రెండు గంటలకు భార్య పార్వతమ్మ లేచి చూసేసరికి పక్కన భర్త కనిపించలేదు. భయపడ్డ ఆమె ఫోన్‌ లైట్‌ వేసి అటు ఇటు వెతకగా కల్లానికి కొంత దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. భయంతో ఫోన్‌ ద్వారా గ్రామస్తులకు విషయం తెలపగా, వారు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని దింపారు. వెంటనే యాలాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రైతుబీమా పథకంలో అంజిలయ్య పేరు నాట్‌ ఎన్రోల్డ్‌
రైతు సాధారణ మరణం చెందినా కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తోంది. అయితే మృతులు అంజిలయ్య రైతుబీమా పథకంలో పేరు నమోదు చేసుకోలేదు. రైతుబీమాలో అంజిలయ్య పేరు నాట్‌ ఎన్రోల్డ్‌ అని చూపిస్తుందని మండల వ్యవసాయ అధికారి యాదగిరి తెలిపారు. దాంతో మృతుని భార్య, పిల్లలు దిక్కులేని వారయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.

Spread the love