‘ఉపా’ ఎత్తివేతకు ఐక్య పోరాటాలు

– 11 వామపక్ష, కమ్యూనిస్టు పార్టీల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ఎత్తివేత కోసం ఐక్య పోరాటాలను చేపట్టాలని 11 వామపక్ష, కమ్యూనిస్టులు పార్టీలు నిర్ణయించాయి. సోమవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఓంకార్‌ భవన్‌లో ఆ పార్టీల సమావేశాన్ని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి (సీపీఐఎం), మండల శ్రీనివాస్‌ (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), ఎం హన్మేష్‌ (సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా), పి మహేష్‌ (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), సిహెచ్‌ మురహరి (ఎస్‌యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), వనం సుధాకర్‌, వి తుకారాం నాయక్‌ (ఎంసీపీఐయూ) తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ములుగు జిల్లా తాడ్వాయిలో 152 మందిపై పెట్టిన ఉపా కేసులను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఆందోళణా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పోడు రైతులకు హక్కు పత్రాలివ్వటంలో, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, పంపిణీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. నిరుద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం దాటవేత విధానం అవలంభిస్తున్నదని పేర్కొన్నారు. ఇంకా గృహలక్ష్మి, ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యలపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహారిస్తున్నదని తెలిపారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు.

Spread the love