గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మున్సిపల్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ప్రజల ఆరోగ్యం కాపాడుతూ పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం అత్యంత దారుణం అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్‌ యూసఫ్‌ అన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కార్మికుల జీతాలు 2014 నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు పెంచి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మున్సిపల్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హిమాయత్‌ నగర్‌ లోని పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మున్సిపల్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాల ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ధర్నా నిర్వహిం చింది. ఈ సందర్బంగా మహమ్మద్‌ యూసఫ్‌ మాట్లా డుతూ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల్లో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారేననీ, ఏండ్లుగా గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల శుభ్రతతో పాటు అన్ని పనులు చేస్తున్నారనీ, మల్టీపర్పస్‌ విధానాన్ని సవరించి పాత పద్దతిలో క్యాటగిరిల ప్రకారం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరారు. కార్మిక చట్టం ప్రకారం పండుగ, జాతీయ, ఆర్జిత, వారాంతపు సెలవులు అమలు చేసి, 2021 జనాభా ప్రాతిపదికన ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడి లేదా కార్మికురాలుని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేతనాలు పెంచడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఎనిమిది గంటల పని దినం, సెలవులు, మెటర్నరీ లీవులు, గ్రాట్యుటీ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఉదాసీన వైఖరి కొనసాగిస్తే సమ్మె బాట పట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం వారు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ హనుమంత రావుకు అందజేశారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఏం.నరసింహ, సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.వెంకట రాజాం, కార్యనిర్వాహక అధ్యక్షులు కె.జయచంద్ర, ఉప ప్రధాన కార్యదర్శి పిట్టల బాలయ్య, రాష్ట్ర నాయకులు అమర్‌ నాథ్‌, బి.దాస్‌, ఈశ్వర్‌, యాదగిరి పాల్గొన్నారు.

Spread the love