తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి

–  వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనీ, అందుకే ఇక్కడ రాష్ట్ర పతిపాలన విధించాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల కోరారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ”తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశానని తెలిపారు. కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలు అవుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదని విమర్శించారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం… నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని ఆమె పరామర్శించారు. వైఎస్‌. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ తన పని తాను చేయాలని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని షర్మిల తెలిపారు.

Spread the love