నిజ వేతనాలు పతనం

– గ్రామీణ కార్మికులు ఉక్కిరిబిక్కిరి
– దేశవ్యాప్తంగా రెండేండ్లుగా ఇదే పరిస్థితి
– పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
– సమగ్రచట్టానికి వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌
భారత్‌లోని గ్రామీణ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయంలో ఆదాయం రాక.. భూములు లేక.. వారు వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలుగా మారుతున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న ధరలు గ్రామీణ కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజువారీ వచ్చే కూలీ తక్కువే అయినా.. అందులో ఖర్చులు పోనూ మిగిలే నిజ వేతనం చాలా స్వల్పంగా ఉంటున్నది. 2022-23 ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీంతో వ్యవసాయ కార్మిక సంఘాలు, నిపుణులు ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.
న్యూఢిల్లీ : దేశంలోని మోడీ సర్కారు పాలనలో వ్యవసాయ కార్మికుల జీవితాలకు హామీ లేకుండా పోయింది. పెరుగుతున్న ఖర్చులు.. వారి జీతాల్లో కోతలకు కారణమవుతున్నాయి. ఖర్చులు పోగా మిగిలిన కొద్దిపాటి మొత్తంతో అతి కష్టం మీద గ్రామీణ కార్మికుడు తన కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022-23 ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఈ సర్వే సమాచారం ప్రకారం.. గ్రామీణ కార్మికుల నిజ వేతనాలు (అంటే ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయబడిన వేతనాలు) గత రెండేండ్లుగా పతనమవుతున్నాయి. గ్రామీణ భారతంలో మొత్తం 36.5 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 61.5 శాతం మంది వ్యవసాయంలో, 20 శాతం మంది పరిశ్రమలలో, 18.5 శాతం మంది సేవా రంగంలో పని చేస్తున్నారు.
కార్మికుల్లో అత్యధికం
అణగారిన వర్గాల ప్రజలే భారీ సంఖ్యలో ఉన్న ఈ గ్రామీణ కార్మికులు పడిపోతున్న వేతనాల దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ పరిస్థితి శాశ్వత, హానికరమైన పేదరికానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరించారు. వ్యవసాయ శ్రామిక శక్తిలో సాగుదారులు (రైతులు) ఉన్నారు. 11 ఏండ్ల క్రితం పూర్తయిన జనాభా లెక్కల ప్రకారం భూమిలేని కూలీల సంఖ్య దాదాపు 14 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ సంఖ్యలు తరచుగా లక్షలాది మంది సన్నకారు, చిన్న రైతుల ద్వారా అధికమవుతున్నాయి. వారికి వారి భూములలో తగినంత రాబడి రానందున ఇతరుల పొలాల్లో వారు కూలీ పనిని చేపట్టాల్సి వస్తున్నది. ఈ కార్మికులలో ఎక్కువ మంది షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఉన్నారు.
నిజ వేతనాల్లో పతనం
వీరి వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో పురుషులకు రోజువారీ వేతనం రూ. 364 కాగా.. మహిళలకు రూ. 271గా ఉన్నది. 2020 మేతో పోల్చి చూస్తే ఈ పెరుగుదల పురుషులకు 17 శాతం, మహిళలకు 12 శాతంగా ఉన్నాయి. అయితే, ధరల పెరుగుదలను తీసివేయడం ద్వారా లెక్కించబడే నిజమైన వేతనాలు పడిపోయాయి. పురుషులకు, స్త్రీలకు నిజవేతనాల్లో పెరుగుదల లేకపోగా తగ్గాయి. ఒక వ్యవసాయ కార్మికుడు ఒక సంవత్సరంలో 3-4 నెలల విలువైన పనిని చేయవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం వ్యవసాయేతర పనులను చూసుకోవాల్సి ఉంటుంది.
వ్యవసాయేతర పనుల్లోనూ తక్కువ జీతం
ఒక ట్రేడ్‌ యూనియన్‌ చేసిన సర్వేలో ఒకే గ్రామంలో 61 రకాల పనులు కనుగొనబడ్డాయి. నిర్మాణం, రిటైల్‌ వ్యాపారం, మరమ్మతు, ఉద్యోగాలు, నాసిరకమైన పనులు, ఇంటి పని మొదలైనవి కొన్ని సాధారణ పనులలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర వేతనాలు 2020 మేలో పురుషులకు రూ. 381 ఉండగా.. అది గతేడాది అక్టోబరు నాటికి రూ. 408కి పెరిగింది. మహిళల విషయంలో అది రూ. 226 నుంచి రూ. 269కి చేరింది. పెరుగుతున్న ధరలను పరిగణలోకి తీసుకుంటే నిజ వేతనాలు పడిపోయాయి. పురుషుల నిజ వేతనాలు రూ. 252 నుంచి రూ. 229కి, మహిళల నిజ వేతనాలు రూ. 150 నుంచి రూ. 151కి చేరాయి.
అప్పుల్లో 50 శాతం వ్యవసాయ కుటుంబాలు
వ్యవసాయ పనులతో సతమతమవుతున్న లక్షలాది మందికి వ్యవసాయేతర పనులు అందించాల్సిన వేతనాలను అందించలేకపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుడు పేదరికంతో బాధపడాల్సి వస్తున్నది. కుటుంబాన్ని పోషించడానికి వీటి ద్వారా వచ్చే ఆదాయాలు సరిపోవడం లేదు. ఉచిత వైద్యం, విద్య, పౌష్టికాహారం వంటి సంక్షేమ కార్యక్రమాల ఉపసంహరణ లేదా కోతలు.. ఈ కుటుంబాలకు ఇబ్బందులను తెస్తాయి. ఎందుకంటే వీరి సంపాదనకు ప్రయివేటు విద్య, వైద్యం వంటి ఖర్చులు తలకు మించిన భారాలు అవుతాయి. మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం 50 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.
‘ఉపాధి’ నిజ వేతనం రూ. 122
ఉపాధి హామీ చట్టం గ్రామీణ కార్మికులు, ఇతరులకూ జీవనాధారాన్ని అందిస్తున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 8.19 కోట్ల మంది పని చేశారు. ముఖ్యంగా భూమిలేని కార్మికులు, చిన్న మరియు సన్నకారు రైతులు, ఇతర గ్రామీణ కార్మికులు తమ ఆదాయాన్ని భర్తీ చేయడానికి ఈ పథకాన్ని ఆశ్రయించటం వలన పనికి డిమాండ్‌ ఎక్కవగా ఉన్నది. ప్రస్తుతం ఈ ఉపాధి చట్టం కింద సగటు రోజువారీ కూలీ సుమారు రూ. 218గా ఉన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా చూస్తే ఇది రూ. 122 అన్నమాట. ఇది గతేడాది అక్టోబర్‌లో వ్యవసాయేతర పనులకు నిజమైన వేతనం కంటే రూ. 100 తక్కువ కావడం గమనార్హం.
సమగ్ర చట్టం అవసరం
75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న ఈ అమృత్‌ కాల్‌లో వ్యవసాయ కార్మికుల వేతనాలతో సహా పని పరిస్థితులను క్రమబద్దీకరించడానికి, నిర్ణయించడానికి ఇప్పటికీ ఒక సమగ్రమైన చట్టం లేకపోవడం ఆందోళనకరమైన విషయమని రైతులు, రైతు సంఘాల నాయకులు, నిపుణులు తెలిపారు. ఏండ్ల తరబడి వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ డిమాండ్‌ను చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love