బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్రానికి సుప్రీం నోటీసులు
మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: గుజరాత్‌ హింసాకాండ విషయంలో మోడీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ విషయంలో ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పబ్లిక్‌ డొమైన్‌ నుంచి డాక్యుమెంటరీని తీసివేయడానికి జారీ చేసిన ఆర్డర్‌ కాపీని కోరింది. ఈ వివాదానికి సంబంధించి కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.డాక్యుమెంటరీని బ్లాక్‌ చేయడానికి, సోషల్‌ మీడియా నుంచి లింక్‌లను తీసివేయడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషన్‌లు సవాలు చేశాయి. బ్లాక్‌ చేసే ఉత్తర్వును కేంద్రం ఎప్పుడూ అధికారికంగా ప్రచారం చేయలేదనీ, రెండు భాగాల డాక్యుమెంటరీపై నిషేధాన్ని ”దుష్ప్రవర్తన, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొంటూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా ప్రముఖ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాలు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 21న, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌, 2021 (ఐటీ చట్టం) కింద కేంద్రం అత్యవసర నిబంధనలను ఉపయోగించి వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ ”ఇండియా : ది మోడీ క్వశ్చన్‌”కి సంబంధించి షేర్‌ చేయబడిన లింక్‌లను, పోస్టులను బ్లాక్‌ చేయాలని యూట్యూబ్‌, ట్విట్టర్‌ లను ఆదేశించిన విషయం తెలిసిందే.

చర్చకు కేంద్రం నో..
– అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే : ప్రతిపక్షాలు
– స్తంభించిన ఉభయ సభలు
– సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ వల్ల ఎల్‌ఐసీకి జరిగిన నష్టంపై చర్చించాల్సిందేనని పార్ల మెంటులో ప్రతిపక్షాలు రెండోరోజూ పట్టు బట్టాయి. దాంతో ఉభయ సభల కార్యకలాపా లు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఇది కాస్తా పార్లమెంటులో గందరగోళానికి దారి తీసింది. దాంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌ సభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలు కోరాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటి (జేపీసీ), సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నిరాకరించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలు హౌరెత్తిం చడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన ఆరు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రారంభ మైన ఏడు నిమిషాలకే సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ చైర్మెన్‌ కూడా ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చా రు. దాంతో ప్రతిపక్ష నేతల నిరసనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా పడింది. తరువాత మళ్లీ కార్యాకలాపాలు ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల నుంచి అదే డిమాండ్‌ వినిపించింది. చివరికి ఎలాంటి చర్చ లేకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కాగా పార్లమెంట్‌లో అనుసరిం చాల్సిన వ్యూహంపై చర్చిం చేందుకు 16 ప్రతిపక్ష పార్టీ ల నేతలు శుక్రవారం భేటీ అయ్యారు.

Spread the love