వైఎస్‌ షర్మిల అరెస్టు

– కేసు నమోదు చేసి హైదరాబాద్‌ తరలింపు
నవతెలంగాణ-మహబూబాబాద్‌
తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిలను మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మానుకోట మండలం బేతుల్‌ గ్రామ శివారులో శిబిరంలో ఉన్న వైఎస్‌ షర్మిలను డీఎస్పీ రమణబాబు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. వైఎస్‌ షర్మిల మహాబూబాబాద్‌లో పర్యటించే క్రమంలో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌ నాయక్‌కు ఆయన భార్య సీతా మహాలక్ష్మి విడాకులు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేగాక ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై భూ కబ్జాకోరు.. కొజ్జా మాఫియా.. అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. దాంతో షర్మిల బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ శంకర్‌ నాయక్‌ సతీమణి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు షర్మిల క్యాంపు ముందు 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో షర్మిల క్యాంపును ముట్టడించడానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద కూర్చొని రాస్తారోకో చేశారు. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ సర్పంచ్‌ లూనావత్‌ అశోక్‌ షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై షర్మిల అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ చేసిన ఫిర్యాదు మేరకు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పొద్దున్నే పోలీసులు నోటీసు పట్టుకుని షర్మిల వద్దకు వెళ్లారు. ఆమె నోటీసులు తీసుకోవడా నికి బస్సు నుంచి దిగి రావడానికి నిరాకరించి క్యాంప్‌ నుంచి బయటికి రాలేదు. దాంతో ఎస్‌ఐ దీపికా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా నోటీసు షర్మిలకు ఇచ్చి అరెస్టు చేసి హైదరాబాద్‌ తరలించారు.

Spread the love