సమానత్వం, లౌకికతపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి

–  సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌
మిర్యాలగూడ నుంచి  నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి
దేశంలో సమానత్వం, లౌకీకత్వంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర దాడిచేస్తున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్‌ విమర్శించారు. ప్రజల హక్కులకు రక్షణగా ఉన్న రాజ్యాంగంపై దాడిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రజాసంఘాల ఐక్య వేధిక ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ హక్కులు-సవాళ్లు’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. దీనికి రిటైర్డ్‌ ఉద్యోగులసంఘం నాయకులు జగదీశ్‌చంద్ర అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు అంబటి నాగయ్య, సోషల్‌మీడిమా ఇన్‌ఛార్జీ బి. జగదీశ్‌, సోషల్‌వర్కర్‌ సుబ్బారావు, మహిళా సంఘం పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందాకారత్‌ మాట్లాడుతూ 75 ఏండ్లుగా దేశ స్వాతంత్య్ర ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై గతంలోనూ దాడి జరిగినా, ఇంత తీవ్రంగా లేదని గుర్తుచేశారు. బీజేపీ ఫాసిస్టు సంస్థ ఆర్‌ఆర్‌ఎస్‌ జోక్యం పెరిగిందని చెప్పారు. సమ్మె హక్కు, రైతుల హక్కులు, పోరాడే హక్కు , శ్రామిక హక్కులను కాలరాసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంయక్త ఎజెండాతో ముందుకుపోతున్నాయని విమర్శించారు. ఆర్టికల్‌ 14, 19కి వ్యతిరేకంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పడం బీజేపీ, ఆర్‌ఆర్‌ఎస్‌కు నచ్చడం లేదని అన్నారు. అందుకే సమానత్వం, లౌకికత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయని చెప్పారు. మౌళిక హక్కులను ప్రశ్నార్థకం చేసే చర్యలను కేంద్రం తీసుకుంటున్నదని వివరించారు. రాజ్యాంగ పీఠికలో ఏ ఒక్క మతానికి సంబంధించిన ప్రస్తావన ఉండదని చెప్పారు. భారతీయ నాగరికతలపై దాడిచేయడమే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పనిచేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం మౌళిక స్వభావాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అమాయక ముస్లిం, క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం, లౌకికత్వానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఉపా చట్టం కింద మేధావులు, హక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడం దారుణమని ఖండించారు. స్టాన్‌స్వామీ జైల్లోనే చనిపోయాడనీ, హైదరాబాద్‌కు చెందిన వరవరరావును అరెస్ట్‌ చేశారని గుర్తుచేశారు. దేశంలో పౌరస్వేచ్ఛ తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలక్షన్‌ కమిషన్‌, సుప్రీంకోర్టు, హక్కుల సంస్థలు, మహిళా సంస్థ తదితర రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బీజేపీ బలహీనం చేసిందన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కేంద్రం ఇష్టానుసారంగా నియమించడానికి విల్లేదంటూ సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పిందన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్‌జస్టీస్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన ప్యానెల్‌ ఎన్నికల అధికారులను ఎంపిక చేయాలని చెప్పిందన్నారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసే పోరాటంలో సీపీఐ(ఎం)వెనక్కి తగ్గేది లేదు, రాజీ అసలే లేదని వ్యాఖ్యానించారు.
రంగన్న ‘ప్రజలగొంతుక’ రెండో ఎడిషన్‌ ఆవిష్కరణ
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రచించిన ‘ప్రజలగొంతుక’ ద్వితీయ సంకలనాన్ని బృందకారత్‌ ఈసందర్భంగా ఆవిష్కరించారు. తొలి ప్రతిలో రెండువేల పుస్తకాలు, రెండో ఎడిషన్‌లో మూడు వేల పుస్తకాలు ముద్రించారు. నవతెలంగాణ బుకహేౌస్‌ ఈపుస్తకాన్ని ప్రింట్‌ చేసింది. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ముందుమాట రాశారు. సభలో సీనియర్‌ జర్నలిస్టు బి.బసవపున్నయ్య పుస్తక పరిచయం చేశారు. పుస్తకంలోని ముఖ్యాంశాలు సభిóకులకు వివరించారు.
మహాసభలో ఆమోదించిన తీర్మానాలు
మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలు చేశారు.
– గిరిజన బంధు తక్షణమే అమలు చేయాలి.
– పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
– వాల్మీకిబోయ ఇతర 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకూడదు.
– గిరిజన యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి.
– 10 శాతం రిజర్వేషన్‌పై తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి.
– గిరిజనుల మధ్య ఘర్షణ పెంచుతున్న బీజేపీ వైఖరిని ఖండించాలి.
– తండా పంచాయతీలకు సంవత్సరానికి రూ.5 కోట్ల నిధులు ఇవ్వాలి.
– మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏ ఏర్పాటు చేయాలి.
– కేంద్రం తీసుకొస్తున్న అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలి.
– లంబాడి, ఇతర తెగల భాషలను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి.
– గిరిజన విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్స్‌ స్కూల్‌ పథకంలో ప్రతి సంవత్సరం 2000 సీట్లు కేటాయించాలి.
– ట్రైకార్‌ కింద దరఖాస్తు పెట్టుకున్న గిరిజనులకు రుణాలు ఇవ్వాలి.
– జాటోతు తానునాయక్‌ మ్యూజియం ఏర్పాటు చేసి విగ్రహం పెట్టాలి.
– గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలి.
– భూమి లేని గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి.
– గిరిజన విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచాలి.
– ప్రయివేటు రంగంలో రిజర్వేషన్‌ కల్పించాలి.
– జిల్లా యూనిట్‌గా తీసుకొని అసెంబ్లీ సీట్లను కేటాయించాలి.
– బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాలి.
– పుట్టిన ప్రతి గిరిజన బిడ్డకూ రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాలి.

Spread the love