సిరీస్‌పై కన్నేసి..!

ఈడెన్‌గార్డెన్స్‌లోనే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. గువహటిలో ఏకపక్ష విజయం సాధించిన రోహిత్‌సేన..
నేడు కోల్‌కతలో శ్రీలంకపై మరో మెరుపు విజయానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత టాప్‌ ఆర్డర్‌ దూకుడు ఆతిథ్య జట్టుకు ఉత్సాహం ఇస్తుండగా.. నాయకుడు శనక మెరుపు ప్రదర్శనలు శ్రీలంక శిబిరంలో ఆశలు చిగురింపజేస్తున్నాయి. సిరీస్‌ కోసం భారత్‌, సమం కోసం శ్రీలంక నేడు ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండో వన్డేకు సిద్ధమవుతున్నాయి.
– శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే నేడు
– మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
నవతెలంగాణ-కోల్‌కత

భారత్‌, శ్రీలంక చివరగా ఈడెన్‌గార్డెన్స్‌లో తలపడిన వన్డే (2014) మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ రికార్డు 264 పరుగుల ద్వి శతకం బాదాడు. గువహటి తొలి వన్డేలో రోహిత్‌ శర్మ మెగా ఇన్నింగ్స్‌ దిశగా సాగాడు. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావటం భారత్‌కు సానుకూలం. ఇక బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమవుతున్న వేళ శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ శనక అద్వితీయ ప్రదర్శన చేస్తున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో శనక మెరుపులకు.. టాప్‌ ఆర్డర్‌లో మరో బ్యాట్‌ జతకలిస్తే ఈడెన్‌గార్డెన్స్‌లో పోరు కాస్త ఆసక్తికరంగా మారనుంది. సొంతగడ్డపై భారత్‌ మరోసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌, శ్రీలంక రెండో వన్డే పోరు నేడు.
ఈడెన్‌లోనే ముగిస్తారా? :
బంగ్దాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓటమి అనంతరం.. స్వదేశంలో భారత్‌ పూర్తి భిన్నమైన ప్రదర్శన చేసింది. సుదీర్ఘ విరామం అనంతరం టాప్‌-3 బ్యాటర్లు పరుగులు మోత మోగించారు. బౌలర్లు కలిసికట్టుగా వికెట్ల వేట సాగించారు. లోయర్‌ ఆర్డర్‌ విలువైన పరుగులు జోడించింది. కొంతకాలంగా పేలవంగా రాణిస్తున్న రోహిత్‌ శర్మ ప్రియ ప్రత్యర్థి శ్రీలంకపై జూలు విదిల్చాడు. అచ్చొచ్చిన ఈడెన్‌లో కలిసొచ్చే ప్రత్యర్థిపై నేడు మెగా ఇన్నింగ్స్‌పై కన్నేశాడు రోహిత్‌. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో తుది జట్టులో నిలిచిన శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టాడు. పరుగుల వేటలో వేగం తగ్గినా.. రోహిత్‌తో కలిసి మెప్పించాడు. ఇక విరాట్‌ కోహ్లి కెరీర్‌ 45వ వన్డే సెంచరీతో అలరించాడు. ఆ జోరు ఈడెన్‌లోనూ చూపిస్తాడేమో చూడాలి. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం మంచి ప్రదర్శన చేశారు. కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు కోసం వేచి చూడాల్సిందే. ఇక బౌలింగ్‌ విభాగంలో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ పురోగతి సాధించాడు. ప్రసిద్‌ కృష్ణ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్‌ మాలిక్‌ మిడిల్‌ ఓవర్లలో చక్కగా రాణించాడు. నియంత్రణ సాధించినా.. వైవిధ్యంపై దృష్టి పెటాల్సి ఉంది. మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమిలతో కలిసి మాలిక్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. అక్షర్‌ పటేల్‌కు తోడుగా చాహల్‌ ఉంటాడా? లేదా కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.
పుంజుకుంటారా? :
తొలి వన్డేలో శ్రీలంక తేలిపోయినా.. పర్యాటక జట్టు శిబిరంలో సానుకూల అంశాలు ఉన్నాయి. ఓపెనర్‌ నిశాంక అర్థ సెంచరీ సాధించాడు. ధనంజయ డిసిల్వ 40 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కెప్టెన్‌ దసున్‌ శనక అజేయ సెంచరీ కొట్టాడు. కొండంత లక్ష్య ఛేదనలో లంకేయులు రేసు నుంచి నిష్క్రమించినా.. 320-340 పరుగుల ఛేదన భిన్నంగా ఉండేది. నేడు ఈడెన్‌గార్డెన్‌ వన్డేకు శ్రీలంక తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే శ్రీలంక బౌలర్లు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయాలి. ఇక శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగ అంచనాలను అందుకోలేదు. వన్డే ఫార్మాట్‌లో హసరంగ గణాంకాలు ఆకట్టుకునేలా లేవు. 35 వన్డేల్లో 36.51 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. అయినా, జట్టులో అతడే అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌. దీంతో శ్రీలంకకు హసరంగ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో కీలకం కానున్నాడు. మహీశ్‌ తీక్షణ, చామిక కరుణరత్నె సైతం అంచనాలకు తగినట్టుగా రాణించాల్సి ఉంది.
పిచ్‌, వాతావరణం :
సుమారు ఐదేండ్ల విరామం అనంతరం ఈడెన్‌ గార్డెన్స్‌ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 252కు ఆలౌట్‌ కాగా, ఆస్ట్రేలియా ఛేదనలో 202 పరుగులకే కుప్పకూలింది. నేడు వన్డే మ్యాచ్‌కు వర్షం సూచనలు లేవు. కానీ అతి శీతల వాతావరణం ఉండనుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమి, ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వెంద్ర చాహల్‌.
శ్రీలంక : నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్‌ శనక (కెప్టెన్‌), వానిందు హసరంగ, డునిత్‌ వెల్లెంగె, చామిక కరుణరత్నె, కసున్‌ రజిత, దిల్షాన్‌ మధుశంక.

Spread the love