క్లీన్‌స్వీప్‌పై గురి


– భారత్‌-బంగ్లాదేశ్‌ చివరి టెస్ట్‌ నేటినుంచే.. ొ ఉదయం 9.00గం||ల నుంచి

ఢాకా: తొలి టెస్ట్‌లో గెలిచిన టీమిండియా ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ తొలి టెస్ట్‌ గెలిచి 1-0 ఆధిక్యతలో ఉంది. షేర్‌-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగే టెస్ట్‌లోనూ గెలిచి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దారి సుగమం చేసుకోనుంది. ఛోటోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150పరుగులకే కుప్పకూలింది. ఆ టెస్ట్‌లో టీమిండియా 188పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ ఈ టెస్ట్‌కు దూరం కావడంతో తొలిటెస్ట్‌లో ఆడిన భారత ఆటగాళ్లే రెండో టెస్ట్‌లోనూ బరిలోకి దిగనున్నారు. ఐసిసి టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 87పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 120పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. తొలి టెస్ట్‌ ప్రదర్శన ఆధారంగా ఎలాంటి మార్పులకు అవకాశం లేనప్పటికీ అశ్విన్‌ స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. ఈ మైదానం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్‌ ఆడిన జట్టులో మరో మార్పు చేసే అస్కారం లేదు. జట్టులో ఇదివరకే ఇద్దరు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌ను కొనసాగించాలని, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాల నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి ప్రయోగాలు చేయరాదని మరికొందరు కోరుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్‌ జట్టుకు తస్కిన్‌ అహ్మద్‌ అందుబాటులోకి వచ్చాడు. భారత్‌తో ఆడిన తొలి టెస్ట్‌కు అతడు దూరం కావడం, ముస్తాఫిజుర్‌ టెస్ట్‌కు ఎంపిక కాకపోవడంతో ఆ జట్టు ఓడినట్లు జట్టు యాజమాన్యం భావిస్తోంది.
జట్ల(అంచనా):
భారత్‌: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, పుజరా, కోహ్లి, శ్రేయస్‌, అక్షర్‌, పంత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, కుల్దీప్‌, ఉమేశ్‌/ఉనాద్కట్‌, సిరాజ్‌/సౌరభ్‌ కుమార్‌.
బంగ్లాదేశ్‌: షకీబ్‌(కెప్టెన్‌), నూరీ హసన్‌(వికెట్‌కీపర్‌), నజ్ముల్‌, యాసిర్‌ అలీ, లింటన్‌ దాస్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మెహిదీ హసన్‌, తైజుల్‌ ఇస్లామ్‌, తస్కిన్‌ అహ్మద్‌, మోమిముల్‌/ఖలీద్‌ అహ్మద్‌, మోమినుల్‌ హక్‌.

Spread the love