హెచ్‌సీఏకు ఏక సభ్య కమిటీ

–  వివాదాలు, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత
–  విశ్రాంత జస్టిస్‌ నాగేశ్వర రావు నియామకం
– హెచ్‌సీఏపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఎట్టకేలకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు జరుగనున్నాయి. అజహర్‌, విజయానంద్‌లకు చెక్‌ పవర్‌ తొలగించిన సుప్రీంకోర్టు.. గతంలో నియమించిన పర్యవేక్షణ కమిటీని సైతం రద్దు చేసింది. భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలను పర్యవేక్షించిన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావుకు హెచ్‌సీఏ వివాదాల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏక సభ్య కమిటీకి జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎట్టకేలకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రతిష్ఠంభనకు ముగింపు పడనుంది!. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో ఎన్నికైన పాలక మండలి ఆట అభివృద్దిని పక్కనపెట్టి రాజకీయాల్లో మునిగిపోవటంతో వ్యవస్థను చక్కదిద్దేం దుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీని నియమించింది. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లే కాస్త నయం అనిపించేలా సాగిన పర్య వేక్షణ కమిటీని తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైదరాబాద్‌ క్రికెట్‌లో సంస్థా గతంగా కొనసాగుతున్న వివాదాలకు పరిష్కారం చూపటంతో పాటు నూతన ఆఫీస్‌ బేరర్లు ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏ వర్సెస్‌ చార్మినార్‌ క్రికెట్‌ క్లబ్‌ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పర్యవేక్షణ కమిటీ రద్దు
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో ఎన్నికైన ఆఫీస్‌ బేరర్లు అంతర్గత కుమ్ములాటలతో నిత్యం కోర్టు గడప తొక్కుతూ ఆటను నిర్లక్ష్యం వహించారు. దీనిపై ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు గతంలో నలుగురు సభ్యులతో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కంటే దారుణంగా పర్యవేక్షణ కమిటీ పని చేసింది. కమిటీలో ఏ ఇద్దరు ఓ అంశంపై ఏకీభవించని పరిస్థితి. సుప్రీంకోర్టు అప్పగించిన బాధ్యతలను విస్మరించి.. ఇతర అంశాల్లో హెచ్‌సీఏకు సిఫారసులు చేయటం సుప్రీంకోర్టుకు ఆగ్రహం కలిగించింది. హెచ్‌సీఏలో సమస్యలను సద్దుమణిగేలా చేసేందుకు మరో 13 వారాల గడువు కోరిన పర్యవేక్షణ కమిటీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇంతకాలం హెచ్‌సీఏ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు, ఇతర అవసరాలకు అజహరుద్దీన్‌, విజయానంద్‌లకు ఇచ్చిన చెక్‌ పవర్‌ను సైతం సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఏకసభ్య కమిటీ
హెచ్‌సీఏ పాలక మండలి, పర్యవేక్షణ కమిటీ గడువు (మూడు నెలలు) ముగియటంతో ప్రస్తుతం హెచ్‌సీఏలో మాజీల పాలన సాగుతుందని సీనియర్‌ న్యాయవాది జయంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హెచ్‌సీఏలో తరచుగా తలెత్తుతున్న వివాదాలు, సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకు విశ్రాంత న్యాయమూర్తి ఎల్‌.నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించటం మంచిదని మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవె ధర్మాసనానికి సూచించారు. ‘జస్టిస్‌ నాగేశ్వరరావు పర్యవేక్షణ అవసర మైతే.. ఆయన పర్యవేక్షణలో ఎలక్టోరల్‌ కాలేజ్‌ను (హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు వేసే సభ్యులు) ఉంచుదాం. ఆయన పర్యవేక్ష ణలో జరిపిద్దాం. మరి, అందుకు జస్టిస్‌ రావు సుముఖంగా ఉన్నారా? ఆయన సుముఖత ఎవరైనా తెలుసుకున్నారా? అని జస్టిస్‌ కౌల్‌ అడిగారు. అందుకు అడ్వకేట్‌ జయంత్‌ భూషణ్‌ స్పందిస్తూ.. ‘ఒకవేళ పర్యవేక్షణ కమిటీలో ఇతర సభ్యులు ఉంటే అందులో పని చేసేందుకు జస్టిస్‌ రావు సిద్ధంగా లేరు. ఒకవేళ ఏకసభ్య కమిటీ అయితే పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు’ అని ధర్మాసనంతో తెలిపారు.
దీంతో రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు ఏక సభ్య కమిటీ పర్యవేక్షణలో హెచ్‌సీఏ వివాదాలు, ఎన్నికల ప్రక్రియ ముగియాలని త్రి సభ్య ధర్మాసనం ఆదేశించింది. మాజీ అధ్యక్ష, కార్యదర్శుల చెక్‌ పవర్‌ రద్దు చేశాం. పూర్తి అధికారం ఏక సభ్య కమిటీకి అప్పగించాం. అంతమాత్రాన, భారం అంతా ఆయనపై మోపవద్దు. హెచ్‌సీఏ యంత్రాంగం ఈ ప్రక్రియలో జస్టిస్‌ రావుకు అవసరమైన సహాయం అందించాలి. ఏక సభ్య కమిటీ ఆర్థిక వ్యవహారాలను సైతం హెచ్‌సీఏ చూసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. అయితే, ఆ రోజు ఏక సభ్య కమిటీ అంశంలో జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావుకు ఏమైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని, ఇతర ఏ అంశాలను ధర్మాసనం వినబోదని స్పష్టం చేశారు.
ఐఓఏను చక్కదిద్దిన వ్యక్తి
భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) పలు వివాదాలు, సమస్యలు ఎదుర్కొని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నుంచి నిషేధం ఎదుర్కొనే ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐఓఏ నూతన రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, ఎలక్టోరల్‌ కాలేజ్‌ బాధ్యతలను సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావుకు అప్పగిం చింది. ఐఓఏలో వివాదాలకు ముగింపు పలికిన జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)ను చక్కదిద్దేందుకు ఇక్కడికి రానున్నాడు.

Spread the love