
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గత పది నెలలుగా ఉపకార వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని టి వి వి పిజి వైద్య విద్యార్థులు టి వి వి పి కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కొఠి డిఎం ఈ ఆవరణలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ను వారు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2020లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్షాన డిప్లొమాటిక్ నేషనల్ బోర్డు ఆధ్వర్యంలో 46 మంది నీ సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు పీజీ వైద్య విద్యార్థులను ఎంపిక చేశారు అన్నారు. 2023 వరకు ఉపకార వేతనాలు అందించినప్పటికీ, గత ఏడాది ఏప్రిల్ నుంచి సుమారు 10 నెలలుగా ఉపకార వేతనాలు అందజేయడం లేదని వారు ఆరోపించారు స ఈ విషయమై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ను , వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులను పలుమార్లు విన్నవించిన తమ సమస్యను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని అన్నారు. గత నెల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా పది రోజులలో మీ సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారన్నారు. మంత్రి హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ తమ సమస్య పరిష్కా పరిష్కారం కాకపోవడంతో పాటు ఉపకార వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిఎన్ బీలో ఉన్న 46 మంది పీజీ వైద్య విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయాలని టి వి వి పి కమిషనర్ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేసి జీతాలు ఇవ్వాలని కోరారు.