పాట్నా: ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల వర్షం బిహార్ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది చనిపోయారు. తాజాగా మరో 10 మంది బలైపోయారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గడిచిన 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల పిడుగులు పడిన ఘటనల్లో 10 మంది చనిపోయినట్లు బీహార్ సిఎం నీతీశ్ కుమార్ కార్యాలయం వెల్లడించింది. నలంద జిల్లాలో ఇద్దరు మతిచెందగా.. వైశాలి, భాగల్‌పుర్, సహస్ర, రోహ్తాస్, సరన్, జమూయి, భోజ్‌పుర్, గోపాల్‌గంజ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఒక్కొ కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను ఆయన కోరారు.