శత శాతానికి విఘాతం..!

Adilabad– జిల్లాలో మరుగుదొద్ల నిర్మాణంలో అలసత్వం
– నాసిరకం పనులతో సగానికి పైగా నిరూపయోగం
– పురోగతి సాధించడంలో అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాగానే 2019లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహితం) చేయాలని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసింది. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కై పథకాన్ని గాలికి వదిలేసి కాసుల దండుకున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి.
జిల్లాలో ఇది పరిస్థితి
అధికారులు 2019లో జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న గహాలలో 53,533 గృహాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించి వాటిని నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి గాను ప్రతి మరుగుదొడ్డికి మొదట్లో రూ.12,000 తర్వాత దానిని సవరిస్తూ రూ.15000లకు పెంచారు. అయితే ఆయా గ్రామ పంచాయతీల అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నామమాత్రంగా పనులు పూర్తి చేశారు.
జిల్లాలో ఓడీఎఫ్‌ అధ్వానం
జిల్లాలోని 334 గ్రామపంచాయతీలో ఓడీఎఫ్‌ అప్పుడే వంద శాతం పూర్తి చేసిన అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అనేక గ్రామపంచాయతీలో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండి బహిరంగ మలవిసర్జన ఇంకా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం సఫలం కాకపోగా డబ్బు వృథా అయి గ్రామాల్లో అపరిశుభ్రత పెరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో నిరూపయోగం
గ్రామపంచాయతీ సెక్రటరీలకు మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా ఇవ్వడంతో వేగంగా పూర్తి చేసి నామమాత్రంగా పనులు చేశారు. అవి ప్రస్తుతం 50 శాతం పైగా నిరుపయోగంగా ఉన్నాయి. దీనిపై అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
100శాతం సాధించినట్లు అవార్డు సొంతం
2019 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో నేషనల్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ ఆధ్వర్యంలో 100 శాతం ఓడీఎఫ్‌ సాధించినట్లు జిల్లా అధికారులు అవార్డు తీసుకున్నారు. అయితే తర్వాత దాని నిర్వహణ చేయాల్సిన గ్రామస్థాయి అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా తయారయింది.

Spread the love