119 నిలుపుకున్నారు!

119 retained!– పాక్‌పై భారత్‌ ఘన విజయం
– రాణించిన రిషబ్‌ పంత్‌, బుమ్రా
– భారత్‌ 119/10, పాకిస్థాన్‌ 113/7
– ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024
స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో విన్నర్‌ టీమ్‌ ఇండియా.120 పరుగుల ఛేదనలో పాకిస్థాన్‌ చతికిల పడింది. భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో పాక్‌ బ్యాటర్ల ఆట కట్టించారు. మహ్మద్‌ రిజ్వాన్‌ (31) పోరాడినా టీమ్‌ ఇండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రిషబ్‌ పంత్‌ (42) రాణించటంతో తొలుత భారత్‌ 119 పరుగులు చేసింది.
నవతెలంగాణ-న్యూయార్క్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా జోరు కొనసాగుతుంది. గ్రూప్‌-ఏలో వరుసగా రెండో విజయం సాధించిన రోహిత్‌సేన అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం న్యూయార్క్‌ నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ 6 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా (3/14), హార్దిక్‌ పాండ్య (2/24) రాణించటంతో పాకిస్థాన్‌ ఛేదనలో చతికిల పడింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (31, 44 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) పోరాటం చేశాడు. అంతకుముందు, రిషబ్‌ పంత్‌ (42, 31 బంతుల్లో 6 ఫోర్లు) సహా అక్షర్‌ పటేల్‌ (20, 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 119 పరుగులు చేసింది. పాక్‌ పేసర్లు నసీం షా (3/21), రవూఫ్‌ (3/21) మెరవటంతో భారత్‌ 19 ఓవర్లలోనే ఆలౌటైంది. గ్రూప్‌-ఏలో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌.. టోర్నీలో సూపర్‌8 దశకు చేరుకునే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది!.
రిజ్వాన్‌ పోరాడినా.. : 120 పరుగుల ఛేదనలో పాక్‌ దూకుడుగా సాగింది. బాబర్‌ ఆజామ్‌ (13), ఉస్మాన్‌ ఖాన్‌ (13)లు మహ్మద్‌ రిజ్వాన్‌ (31)తో కలిసి మంచి ఆరంభాలు అందించారు. ఫకర్‌ జమాన్‌ (13) సైతం నిష్క్రమించినా.. ఓ ఎండ్‌లో రిజ్వాన్‌ ఒంటరి పోరాటం చేశాడు. రిజ్వాన్‌ క్రీజులో ఉండగా పాక్‌ గెలుపు దిశగా సాగింది. రెండో స్పెల్‌లో బంతి అందుకున్న బుమ్రా.. తొలి బంతికే రిజ్వాన్‌ కథ ముగించి భారత్‌ను రేసులోకి తెచ్చాడు. షాదాబ్‌ ఖాన్‌ (5), ఇమద్‌ వసీం (15), ఇఫ్తీకార్‌ అహ్మద్‌ (5) తేలిపోయారు. ఆఖరు ఓవర్లో నసీం షా (10 నాటౌట్‌) ఊరట పరుగులు సాధించాడు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసిన పాక్‌ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
పంత్‌ ఒక్కడే..! : టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సీనియర్‌ బ్యాటర్లు మరోసారి ఆశించిన ఆరంభం అందించలేదు. విరాట్‌ కోహ్లి (4), రోహిత్‌ శర్మ (13) మూడు ఓవర్లలోపే నిష్క్రమించా రు. ఓ ఫోర్‌తో మెరిసిన కోహ్లి కవర్స్‌లో క్యాచ్‌ ఇవ్వగా.. ఓ సిక్సర్‌, ఫోర్‌ బాదిన రోహిత్‌ ఎక్కువసేపు వికెట్‌ కాపాడుకో లేదు. రిషబ్‌ పంత్‌ (42)తో జతకలిసి న అక్షర్‌ పటేల్‌ (20) మూడో వికెట్‌కు 39 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఎదురుదాడికి ప్రయత్నించిన ఈ జోడీ.. పాక్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. పంత్‌ స్పిన్‌పై తడబడినా విలక్షణ షాట్లతో బౌండరీలు బాదాడు. అక్షర్‌ పటేల్‌ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (7) పంత్‌కు చక్కటి సహకారం అందించాడు. 11.2 ఓవర్లలో 89/3తో మంచి స్కోరు దిశగా సాగిన భారత ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. నిలకడగా పరుగుల వేట సాగించిన పంత్‌ నిష్క్రమణతో పాక్‌ పట్టు బిగించింది. సూర్య (7), దూబె (3), హార్దిక్‌ పాండ్య (7), రవీంద్ర జడేజా (0) నిరాశపరిచారు. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో 19 ఓవర్లలో భారత్‌ 119 పరుగులకు కుప్పకూలింది. సిరాజ్‌ (7 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. పాకిస్థాన్‌ బౌలర్లలో నషీం షా (3/21), హరీశ్‌ రవూఫ్‌ (3/21), మహ్మద్‌ ఆమీర్‌ (2/23) వికెట్ల వేటలో రాణించారు.

Spread the love