– మూడో టీ20లో భారత్ గెలుపు
– 1-2తో సిరీస్‌పై ఆశలు సజీవం
సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 160 పరుగుల ఛేదనలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇద్దరూ అదరగొట్టడంతో.. మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే లాంఛనం ముగించిన టీమ్ ఇండియా సిరీస్‌లో 1-2తో బోణీ కొట్టింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో నాల్గో టీ20 శనివారం లాడర్‌హిల్ (అమెరికా)లో జరుగనుంది.
భారత్ గెలిచింది, సిరీస్‌లో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83, 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తిలక్ వర్మ (49 నాటౌట్, 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఛేదనలో చెలరేగారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (20 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించటంతో 17.5 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిన టీమ్ ఇండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), శుభ్‌మన్ గిల్ (6) నిరాశపరిచారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 159/5 పరుగులు చేసింది. భారత్‌కు 160 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (42, 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోవ్‌మాన్ పావెల్ (40 నాటౌట్, 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. కైల్ మేయర్స్ (25, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (20, 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
సూర్య, తిలక్ షో : ఛేదనలో ఓపెనర్లు యశస్వి (1), గిల్ (6) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (83), తిలక్ వర్మ (49)మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య తనదైన శైలిలో వికెట్ల వెనకాల, ముందూ బౌండరీల వర్షం కురిపించాడు. 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల్లతో శివమెత్తాడు. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన సూర్యకుమార్.. భారత్‌ను గెలుపు బాటలో నడిపించాడు. మరో ఎండ్‌లో తిలక్ వర్మ (49 నాటౌట్) ఆకట్టుకున్నాడు. వరుసగా మూడో టీ20లో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సూర్య నిష్క్రమించినా.. కెప్టెన్ హార్దిక్ (20 నాటౌట్) తోడుగా తిలక్ లాంఛనం ముగించాడు. తిలక్ వర్మ మరో ఎండ్‌లో అర్థ సెంచరీకి పరుగు దూరంలో నిలువగా.. విండీస్ కెప్టెన్ పావెల్ ఓవర్లో సిక్సర్‌తో హార్దిక్ పాండ్య సిరీస్‌లో భారత్‌కు బోణీ విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ :159/5 (బ్రాండన్ కింగ్ 42, రోవ్‌మాన్ పావెల్ 40, కుల్దీప్ యాదవ్ 3/28, అక్షర్ పటేల్ 1/24)
భారత్ ఇన్నింగ్స్ : 164/3 (సూర్యకుమార్ యాదవ్ 83, తిలక్ వర్మ 49, హార్దిక్ 20, జొసెఫ్ 2/25)